logo

  BREAKING NEWS

చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |   నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల కౌంటర్: వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!  |   అమెరికా అధ్యక్షుడి ప్రసంగాల వెనుక మన తెలుగోడి ప్రతిభ  |   ‘పంచాయతీ’ నోటిఫికేషన్ ఎఫెక్ట్: షాకిస్తున్న అధికారులు!  |   ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |  

వైసీపీ నుంచి కేంద్ర మంత్రులు అయ్యేది వీరేనా..?‌

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భేటీ కావ‌డం అటు ఢిల్లీలో, ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయ‌వ‌ర్గాల్లో అనేక ఊహాగానాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. 40 నిమిషాల పాటు ఇరువురి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి, నిధులు, పెండింగ్ అంశాల‌పై జ‌గ‌న్ ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లార‌ని, పూర్తిగా సానుకూల వాతావ‌ర‌ణంలో వీరి భేటీ జ‌రిగింద‌ని వైసీపీ వ‌ర్గాల నుంచి వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే, ప‌లు కీల‌క రాజ‌కీయ అంశాల‌పైన ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌ని నేష‌న‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా ఎన్డీఏలోకి రావాల్సిందిగా జ‌గ‌న్‌ను ప్ర‌ధాని ఆహ్వానించార‌ని, రెండు క్యాబినెట్ మంత్రి ప‌ద‌వుల‌తో పాటు ఒక స‌హాయ మంత్రి ప‌ద‌విని కూడా ఆఫ‌ర్ చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రి మ‌ధ్య ఏకాంతంగా ఈ భేటీ జ‌రిగింది. నిజానికి, ఇప్ప‌టికిప్పుడు ఎన్డీఏలో చేరాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్‌కు, చేర్చుకోవాల్సిన అవ‌స‌రం మోడీకి ఏ మాత్రం లేన‌ట్లు క‌నిపిస్తుంది. కానీ, కొంచెం లోతుగా విశ్లేషించుకుంటే ఎన్డీఏలో వైసీపీ చేర‌డం బీజేపీకి, వైసీపీకి అవ‌స‌ర‌మే.

ముందుగా వైసీపీ విష‌యానికి వ‌స్తే.. 151 సీట్ల‌తో అధికారంలోకి వ‌చ్చినా రాష్ట్రంలో పాల‌న సాఫీగా సాగ‌డం లేదు. మూడు రాజ‌ధానుల అంశం ముందుకుపోవ‌డం లేదు. గ‌త ప్ర‌భుత్వ అవినీతిపై విచార‌ణ చేయించ‌లేక‌పోతోంది. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన బ‌య‌ట‌కే వేర్వేరుగా క‌నిపిస్త‌తున్నా రాష్ట్రంలో ఒకే అజెండాతో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. మ‌రోవైపు పెద్ద ఎత్తున సంక్షేమ ప‌థ‌కాల‌ను జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నారు. అనేక అభివృద్ధి ప‌నులు చేయాల్సి ఉంది. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి. వీటికి ఆర్థిక‌లోటు అటంకంగా మారింది.

ఇలాంటి అనేక స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టాలంటే ఎన్డీఏలో చేర‌డం మంచిద‌నే అభిప్రాయాలు వైసీపీలోని కొంద‌రి నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. బీజేపీకి కూడా వైసీపీని చేర్చుకోవ‌డం అవ‌స‌రం. సుదీర్ఘ‌కాలంగా బీజేపీకి బ‌ల‌మైన మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న శివ‌సేన‌, శిరోమ‌ణి అకాలీద‌ళ్ ఇప్పుడు ఎన్డీఏ నుంచి వెళ్లిపోయాయి. భ‌విష్య‌త్ రాజ‌కీయ అవస‌రాల కోసం బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీని ఎన్డీఏలోకి చేర్చుకోవ‌డం బీజేపీకి కూడా ముఖ్య‌మే. అందుకే రెండు మంత్రి ప‌ద‌వుల‌తో పాటు ఒక స‌హాయ మంత్రి ప‌ద‌విని వైసీపీకి ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఒక‌వేళ ఎన్డీఏలోకి చేరేందుకు జ‌గ‌న్ అంగీక‌రిస్తే ఈ ప‌ద‌వులు ఎవ‌రికి ఇస్తార‌నేది ఇప్పుడు ఆసక్తిక‌రంగా మారింది. కేంద్ర‌మంత్రి ప‌ద‌వికి ప్ర‌ధానంగా విజ‌య‌సాయిరెడ్డి, మిథున్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, రెడ్డి సామాజ‌క‌వ‌ర్గానికి ఒక‌టికి మించి ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశం ఉండ‌దు. కాబ‌ట్టి, ఇద్ద‌రిలో ఒక‌రికే కేంద్ర మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంది. ఎస్సీ లేదా ఎస్టీ నుంచి ఒక‌రికి అవ‌స‌రం ఇవ్వ‌వ‌చ్చు. ఇలా అయితే బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ లేదా అర‌కు ఎంపీ గొడ్డెటి మాధ‌వికి కేంద్ర‌మంత్రిగా అవ‌కాశం వ‌స్తుంది.

మ‌రో మంత్రి ప‌ద‌వికి మ‌చిలీప‌ట్నం ఎంపీ బాల‌శౌరి, న‌ర్స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు, రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్ మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉండ‌వ‌చ్చు. బాల‌శౌరి జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులు. మార్గాని భ‌ర‌త్‌, లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు యువ ఎంపీలుగా జ‌గ‌న్ దృష్టిలో మంచి మార్కులు సంపాదించారు. మార్గాని భ‌ర‌త్ బీసీ సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన వారు. ఈ ముగ్గురిలో ఒక‌రికి మ‌రో మంత్రి ప‌ద‌వి ద‌క్క‌వ‌చ్చు. మొత్తంగా ఈ ఏడుగురు ఎంపీల్లోనే ముగ్గురికి కేంద్ర మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌వ‌చ్చనే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి.

Related News