logo

కేంద్రం కీల‌క నిర్ణ‌యం… ఆధార్‌, పాన్ కార్డు, లైసెన్స్ అన్నింటికీ ఒకే డిజిట‌ల్ ఐడీ ?

కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. అన్ని గుర్తింపు కార్డుల‌ను అనుసంధానం చేయాల‌నే ఆలోచ‌న‌తో కేంద్రం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అన్ని గుర్తింపు కార్డుల‌కు క‌లిపి ఒకే డిజిట‌ల్ ఐడీ రూపొందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంద‌ని స‌మాచారం. ఈ మేర‌కు కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ శాఖ కేంద్ర ప్ర‌భుత్వానికి ఒక ప్ర‌తిపాద‌న అందించ‌న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లేసెన్సు, పాన్ కార్డు, పాస్‌పోర్టు వంటివి వేర్వేరుగా ఉన్నాయి. వీటి అనుసంధానం కూడా పూర్తి స్థాయిలో జ‌ర‌గ‌లేదు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు అన్ని కార్డుల‌ను ప‌ట్టుకెళ్లాల్సి వ‌స్తుంది. ఇప్పుడు మాత్రం ఇలాంటి అవ‌స‌రం లేకుండా ఒకే ఐడీ కేటాయించాల‌నేది కొత్త ప్ర‌తిపాద‌న‌గా తెలుస్తోంది. దీనిని ఫెడ‌రేటెడ్ డిజిట‌ల్ ఐడెంటెటీస్ అని పిలుస్తారు.

అన్ని గుర్తింపు కార్డుల‌ను అనుసంధానం చేసి ఆధార్ కార్డు నెంబ‌రు లాంటి ఒక డిజిట‌ల్ యూనిక్ ఐడీ నెంబ‌రును ప్ర‌తీ ఒక్క‌రికి కేటాయించాల‌నేది ఈ కొత్త ఆలోచ‌న అని జాతీయ మీడియా చెబుతోంది. ఎప్పుడు ఏ గుర్తింపు కార్డు అవ‌స‌ర‌మైతే ఆ గుర్తింపు కార్డును ఉప‌యోగించుకునేందుకు వీలుగా ఒకే డిజిట‌ల్ ఐడీ ఉంటుంద‌ని స‌మాచారం.

కేవైసీ వంటి వాటికి కూడా ఈ కొత్త డిజిట‌ల్ ఐడీని ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. వేర్వేరు గుర్తింపు కార్డులు ఉండ‌టం కంటే ఒకే డిజిట‌ల్ ఐడీ ఉండ‌టం అటు ప్ర‌భుత్వానికి, ఇటు ప్ర‌జ‌ల‌కు మేల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ ప్ర‌తిపాద‌న ఇప్ప‌టివ‌ర‌కు ఆలోచ‌న ద‌శ‌లోనే ఉంది. త్వ‌ర‌లోనే అధ్య‌య‌నం చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఇది క‌నుక విజ‌య‌వంత‌మై డిజిట‌ల్ ఐడీ అమ‌లులోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు చాలా సులువుగా ఉంటుంది.

Related News