ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటుగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు సీఎం జగన్ ను అభినందనలు తెలిపారు.
జగన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ.. ” ఏపీ ముఖ్యంమత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్తిస్తున్నా” అంటూ మోదీ ట్వీట్ చేసారు.
ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సీఎం జగన్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ”ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను” అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లపుడు ఆయురారోగ్యాలతో ఉండాలి. ప్రజా సేవలోనే మీ జీవితాంతం కొనసాగాలంటూ కేటీఆర్ ట్వీట్ చేసారు. అంతేకాకుండా కేటీఆర్ జగన్ ను ‘అన్నా’ అంటూ సంబోధించారు. దీంతో జగన్ అభిమానులు కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
”ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ మరియు దేశ ప్రజల సేవలో మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షిస్తున్నాను.” అంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలుగులో ట్వీట్ చేసారు.
కేంద్ర మంత్రులు హరిదీప్ సింగ్ పూరి, సదానంద గౌడ, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి, నితిన్ గడ్కరీ, గజేంద్రసింగ్ షేకావత్, సంజయ్ ధోత్రే, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, కాన్రడ్ సంగ్మా, బిప్లవ్ దేవ్, డీఎంకే అధినేత స్టాలిన్, తెలంగాణ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంతోష్ కుమార్, మాజీ కేంద్రమంత్రి రాజీవ్ శుక్ల, హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ, సుమంత్, నిఖిల్, డైరెక్టర్లు గోపిచంద్ మలినేని, సుధీర్ వర్మ, అనిల్ రావిపూడి, మహి వి రాఘవ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, కోన వెంకట్, బండ్ల గణేష్ తదితరులు జగన్కు శుభాకాంక్షలు తెలియజేశారు.