కరోనా బారిన పడిన వారు కూడా కొన్ని రోజుల తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనాను మన శరీరం ఎదుర్కున్నప్పుడు సహజంగానే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. వ్యాక్సిన్ కూడా వేయించుకుంటే వీటి ద్వారా కూడా ఏర్పడే యాంటీబాడీలు జత కలిసి కరోనా నుంచి ఎక్కువ కాలం పాటు, ఎక్కువ రక్షణ లభిస్తుందని చెబుతున్నారు.
అయితే, ఒకసారి కరోనా వచ్చిన తర్వాత రెండో సారి రాదని, రెండోసారి వచ్చినా ఏమీ కాదనే భావనతో కొందరు కరోనా వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే, ఒకసారి కరోనా బారిన పడి కోలుకున్న వారు కూడా కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్(సీడీసీ) చెబుతోంది. మన దేశంలో ఐసీఎంఆర్ ఎలాగో అమెరికాలో సీడీసీ అలాగే. కాబట్టి, సీడీసీ చెప్పే విషయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంటుంది.
తాజాగా ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను వెల్లడించింది. కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారిపై, వ్యాక్సిన్ తీసుకోని వారిపై ఈ సంస్థ ఒక స్టడీ చేసింది. వందల మందిపై ఈ స్టడీ జరిగింది. వీరు గత సంవత్సరం కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడి తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారికి రెండోసారి కరోనా సోకే ముప్పు తక్కువగా ఉందని ఈ స్టడీలో తేలింది.
ఒకసారి కరోనా సోకిన తర్వాత కూడా వ్యాక్సిన్ తీసుకోని వారిలో మళ్లీ కరోనా సోకే ముప్పు రెట్టింపు ఉందని వెల్లడైంది. వ్యాక్సిన్ వేసుకోని వారు రీఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం 2.34 రెట్లు ఎక్కువగా ఉందని సీడీసీ గుర్తించింది. కాబట్టి, ఒకసారి కరోనా బారిన పడిన వారు కూడా కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సీడీసీ డైరెక్టర్ రోషల్ వాలన్స్కీ తెలిపారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర రీతిలో వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్‌ను ఎదుర్కోవడానికి గానూ అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరారు.