కరోనా వ్యాక్సిన్ పనితీరుపై చాలా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ స్టడీస్‌లో అనేక విషయాలు వెల్లడవుతున్నాయి. అయితే, స్టడీ చేసే సంస్థను బట్టి ఆ స్టడీకి విశ్వసనీయత ఉంటుంది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్ అనేది ప్రపంచవ్యాప్తంగా పేరున్న సంస్థ. వివిధ వ్యాధులు ప్రబలే సమయంలో ఈ సంస్థ చెప్పిన విషయాలను చాలా దేశాల్లో వైద్యులు ప్రామాణికంగా తీసుకుంటారు.
ఇలాంటి ముఖ్యమైన సంస్థ తాజాగా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిపై ఒక కీలక స్టడీ నిర్వహించింది. ఈ సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు వరకు పలు ఆసుపత్రులు, అత్యవసర విభాగాల్లో చేరిన 32,000 మంది రోగులపై ఈ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్ సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో చనిపోయే అవకాశం 11 రెట్లు తక్కువని తమ అధ్యయనం ద్వారా తేలినట్లు ఈ సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే 10 రెట్లు తక్కువగా ఆసుపత్రిలో చేరే అవకాశం ఉంటుందని పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా దాదాపు 86 శాతం మంది ఆసుప్రతిలో చేరలేదని ఈ స్టడీ చెబుతోంది. అన్ని వయసుల వారిపై వ్యాక్సిన్ పనితీరు బాగుందని ఈ స్టడీ స్పష్టం చేసింది.
వ్యాక్సిన్లు కరోనా యాంటీబాడీలు ఉత్పత్తి చేయడం, కరోనా నుంచి రక్షణ కల్పించడంలో విజయవంతంగా పని చేస్తున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే పెద్ద వయస్సు వారు కూడా కరోనా నుంచి రక్షణ పొందవచ్చని ఈ సంస్థ స్పష్టం చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం, ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి, మరణించే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందట. కాబట్టి, ఎటువంటి అనుమానాలు లేకుండా కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం చాలా మంచిది.