logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

సంచ‌ల‌న అధ్య‌య‌నం.. హైద‌రాబాద్‌లోనే 6.60 ల‌క్ష‌ల మందికి క‌రోనా

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోకి క‌రోనా వైర‌స్ వ్యాప్తికి సంబంధించి శాస్త్ర‌వేత్త‌లు సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు. న‌గ‌రంలో కేవ‌లం 35 రోజుల్లోనే సుమారు 6 ల‌క్ష‌ల 60 వేల మందికి క‌రోనా వైర‌స్ సోకి ఉండ‌వ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు ఒక అధ్య‌య‌నం ద్వారా అంచ‌నా వేశారు. ఈ వార్త వింటే ప్ర‌జ‌ల్లో భ‌యం పుడుతుంది. కానీ, అధ్య‌య‌నానికి సంబంధించి ప‌లు కీల‌క విష‌యాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

సెంట‌ర్ ఫ‌ర్ మాలిక్యుల‌ర్ బ‌యాలజీ(సీసీఎంబీ), ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ(ఐఐసీటీ) ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని తెలుసుకోవ‌డానికి ఓ ప‌రిశోధ‌న చేశారు. ఈ రెండు కేంద్ర ప‌రిశోధ‌న సంస్థ‌లు. హైద‌రాబాద్‌లోనే నెల‌కొని ఉన్నాయి. అందుకే హైద‌రాబాద్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో ఈ అధ్య‌య‌నం చేప‌ట్టాయి.

సాంక్ర‌మిత ల‌క్ష‌ణాలు ఉన్న వైర‌స్ వ్యాప్తిని అంచ‌నా వేయ‌డానికి ఉన్న విధానాల్లో మురుగునీటి ద్వారా అంచ‌నా వేయ‌డం ఒక విధానం. క‌రోనా వైర‌స్ అనేది కేవ‌లం నోటి తుంప‌ర్ల ద్వారానే కాకుండా వైర‌స్ సోకిన వారి మ‌ల‌, మూత్రాల నుంచి కూడా బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇవి క‌లిసే మురుగునీటిలో వైర‌స్ ఎంత మేర‌కు ఉందో గుర్తించ‌డం ద్వారా వైర‌స్ వ్యాప్తి ఎలా ఉందో అంచ‌నా వేయవ‌చ్చు. ఇప్పుడు సీసీఎంబీ, ఐఐసీటీ చేసింది ఇదే అధ్య‌య‌నం.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 40 శాతం మురుగు నీటిని శుద్ధి చేసేందుకు సెవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి వ‌ద్ద శాస్త్ర‌వేత్త‌లు మురుగు నీటి న‌మూనాలు తీసుకోని ప‌రిశోధ‌న‌లు జ‌రిపారు. మురుగు నీటిలో వైర‌స్ ఆన‌వాళ్లు ఏ మేర‌కు ఉన్నాయ‌నేది గుర్తించ‌గా ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ట్రీట్‌మెంట్ ప్లాంట్ల వ‌ద్ద సేక‌రించిన న‌మూనాల ద్వారానే న‌గ‌రంలో 2 ల‌క్ష‌ల మందికి క‌రోనా వైర‌స్ సోకి ఉండొచ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేశారు. కేవ‌లం 40 శాతం మురుగునీటి ద్వారానే 2 ల‌క్ష‌ల మందికి వైర‌స్ ఉంద‌ని అంచ‌నా వేసినందున మొత్తంగా న‌గ‌రంలో 6.60 ల‌క్ష‌ల మందికి వైర‌స్ సోకింద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేశారు.

6.60 ల‌క్ష‌ల మందికి వైర‌స్ వ‌చ్చింద‌నే ఈ అంచ‌నా నిజ‌మైతే ఆసుప‌త్రుల్లో చేరుతున్న వారి సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంది కాబ‌ట్టి క‌రోనా వైర‌స్ ఊహించినంత ప్ర‌మాద‌క‌రంగా ఏమీ లేద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. 60 శాతం మందికి క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు కూడా గుర్తించ‌క‌ముందే వైర‌స్ శ‌రీరంలో నుంచి వెళ్లిపోతోంది అనేది కూడా ఈ అంచ‌నా ద్వారా తెలుస్తోంది. మ‌రోవైపు మ‌ర‌ణాల సంఖ్య కూడా చాలా త‌క్కువ‌గా ఉన్న‌ట్లే లెక్క‌.

కాబ‌ట్టి, ఒక్క హైద‌రాబాద్‌లోనే 6.60 ల‌క్ష‌ల మందికి క‌రోనా వైర‌స్ సోకింద‌నే వార్త భ‌య‌పెడుతున్నా వైర‌స్ వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌క‌పోవ‌డం, రిక‌వ‌రీ రేటు గ‌ణ‌నీయంగా ఉండ‌టం, మ‌ర‌ణాల రేటు చాలా త‌క్కువ‌గా ఉండ‌టం వంటి విష‌యాల‌ను ఈ అధ్య‌య‌నం నుంచి గ్ర‌హించ‌వ‌చ్చు. కాబ‌ట్టి, ఈ అధ్య‌య‌నం ద్వారా అంత‌గా భ‌యాందోళ‌న‌ల‌కు గురి కావాల్సిన ప‌నేమీ లేదు.

Related News