వాక్సిన్ కు సంబందించిన అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. తాజాగా మహిళలు వాక్సిన్ వేసుకునే విషయంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మహిళలు నెలసరి కి ఐదు రోజుల ముందు, ఐదు రోజుల తర్వాత వాక్సిన్ వేసుకుంటే ప్రమాదమని, ఆ సమయంలో మహిళల రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటుందని ఆ వార్త సారాంశం. మహిళలు ఆ సమయంలో వాక్సిన్ వేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మరింత క్షీణించి సడెన్ అటాక్ లకు గురవుతారట.
అయితే నెలసరి సమయాల్లో వాక్సిన్ కు దూరంగా ఉండాలనే వార్తలను గైనకాలజిస్టులు కొట్టి పారేస్తున్నారు. ఈ వార్తలన్నీ వట్టి పుకార్లేనని, మహిళలు ఏ సమయంలోనైనా వాక్సిన్ తీసుకోవచ్చని అంటున్నారు. రుతుక్రమం సమయంలోగాని రుతు క్రమం రావడానికి ఐదు రోజుల ముందు, ఆ తర్వాత వాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావని అంటున్నారు.
మే 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలుసుకోకుండా ప్రతి ఒక్కరు వీటిని వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. ఇలాంటి వార్తలు వాక్సిన్ వేయించుకునే వారిలో అనవసర భయాలను పెంచుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు నిర్భయంగా వాక్సిన్ వేయించుకుని కరోనా కట్టడికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు.