కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. పేరుకు ఆయన నియోజకవర్గ స్థాయి నేత. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న లీడర్ సిద్ధార్థ్ రెడ్డి. తన పవర్ఫుల్ స్పీచ్‌లు, పదునైన డైలాగ్‌లతో అందరినీ ఆకర్షించి చిన్న వయస్సులోనే బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, మూడు పదుల వయస్సు కూడా నిండకముందే కర్నూలు జిల్లాలో తలపండిన రాజకీయ నాయకులను ఢీకొడుతూ దూసుకెళుతున్నాడు.
బైరెడ్డి కుటుంబం మూడు తరాలుగా రాజకీయాల్లో ఉంది. సిద్ధార్థ్ రెడ్డి తాత బైరెడ్డి శేషశయనారెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా పని చేశారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ్ముడి కుమారుడు సిద్ధార్థ్ రెడ్డి. మొదట పెదనాన్న రాజశేఖర్ రెడ్డికి తోడుగా సిద్ధార్థ్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినా తర్వాత ఆయనను విభేదించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి, సిద్ధార్థ్ రెడ్డికి రాజకీయంగా విభేదాలు మొదలయ్యాయి. రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ వారసురాలిగా ఆయన కూతురు బైరెడ్డి శబరిని తీసుకొచ్చారు. దీంతో ఇద్దరూ ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలు రావడంతో వీరి వార్ తారస్థాయికి చేరింది. బైరెడ్డి కుటుంబం స్వగ్రామం ముచ్చుమర్రి గ్రామం. ఈ గ్రామం ఇప్పుడు కొత్త ముచ్చుమర్రి, పాత ముచ్చుమర్రిగా రెండు గ్రామ పంచాయతీలుగా మారింది.
ఈ రెండు గ్రామాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా పైచేయి సాధించాలని రాజశేఖర్ రెడ్డి, ఆయన కూతురు శబరి ఒకవైపు, సిద్ధార్థ్ రెడ్డి మరోవైపు పట్టుదలకు పోయారు. దీంతో ఈ రెండు గ్రామాల్లో వైసీపీ వర్సెస్ బీజేపీగా పంచాయతీ వార్ నడిచింది. హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. ఒకరిపై ఒకరు పదునైన విమర్శలు చేసుకోవడంతో రాష్ట్రంలోనే ఈ రెండు గ్రామాలు హాట్సీట్లుగా మారాయి.
ఈ ఉత్కంఠ పోరులో తన పెదనాన్న, అక్కపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పైచేయి సాధించి తన సత్తా చాటుకున్నారు. ఈ రెండు గ్రామాల్లోనూ సిద్ధార్థ్ రెడ్డి పెట్టిన వైసీపీ అభ్యర్థులే ఘన విజయం సాధించారు. పాత ముచ్చుమర్రిలో వైసీపీ అభ్యర్థి ఆంజనేయులు, కొత్త ముచ్చుమర్రిలో వైసీపీ అభ్యర్థి రాధమ్మ భారీ మెజారిటీతో బీజేపీ అభ్యర్థులను ఓడించారు. వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఈ రిజల్ట్ ద్వారా స్వంత గ్రామంలోనూ తన పెదనాన్న, అక్క కంటే తనకే పట్టుందని సిద్ధార్థ్ రెడ్డి రుజువు చేసుకున్నారు.