ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా క్రేజ్ ఉన్న యువ నాయకుల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకరు. ఆయన మైక్ పట్టుకుంటే తన నోటి నుంచి మాటలు తూటాల్లా పేలుతుంటాయి. తన వారి కోసం, తన వెంట ఉన్న వారి కోసం ధైర్యం వ్యవహరించడం బైరెడ్డి స్వభావం. ఈ గుణాలతోనే సిద్ధార్థ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే, ఇప్పటి వరకు కేవలం నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి అనే ఒకే ఒక పదవిలో బైరెడ్డి కొనసాగారు.
ఇది కేవలం పార్టీ పదవి మాత్రమే. ఎటువంటి ప్రోటోకాల్ ఉండదు. ఇప్పుడు మాత్రం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మంచి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. శాసనమండలిలో జూన్ 18వ తేదీ వరకు 20 వరకు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిల్లో కొన్ని ఎమ్మెల్యే కోటా, మరికొన్ని స్థానిక సంస్థలు, గవర్నర్ కోటా స్థానాలు ఉన్నాయి. సంఖ్యాపరంగా బలంగా ఉన్న వైసీపీకే ఈ అన్ని సీట్లు దక్కనున్నాయి.
పార్టీ కోసం కష్టపడినా సరైన అవకాశాలు రాని వారిని గుర్తించి ఈ ఎమ్మెల్సీ స్థానాలు అప్పగించాలని జగన్ నిర్ణయించారు. వీటిల్లో ఒక స్థానాన్ని బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి కచ్చితంగా దక్కే అవకాశం ఉంది. నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న గౌరు దంపతులు పార్టీని వీడినప్పుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసీపీలోకి వచ్చారు. చిన్న వయస్సే అయినా కూడా ఫ్యాక్షన్ గడ్డలో పార్టీని సమర్థంగా ముందుకు నడిపించారు.
ఈ విషయాన్ని జగనే స్వయంగా ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. సిద్ధార్థకు కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. ఒకవేళ ఇది జనరల్ స్థానమైతే ఈసారి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎమ్మెల్యే అయ్యేవారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి, రిజర్వుడ్ స్థానాలు మారితే తప్ప బైరెడ్డి ఎమ్మెల్యే కాలేరు. ఇది ఇప్పట్లో సాధ్యం కాదు. కానీ, నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ భారీ మెజారిటీతో గెలవడంలో సిద్ధార్థరెడ్డిది కీలక పాత్ర.
కాబట్టి, బైరెడ్డి కష్టాన్ని గుర్తించిన జగన్ ఆయనను ఎమ్మెల్సీ చేయాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ కనుక బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీ అయితే ఆయన ఒక అరుదైన రికార్డు స్వంతం చేసుకునే ఛాన్స్ ఉంది. బహుశా అతి చిన్న వయస్సులో పెద్దల సభకు ఎన్నిక అవుతున్న నాయకుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఏపీ చరిత్రలో నిలిచిపోతారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి.