అనారోగ్యంతో మరణించిన బావమరిది కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లలేకపోవడం ఆ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. సొంత బంధువులే ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసారు. ఈ అమానుష ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ అల్వాల్ లో ఉండే రాచర్ల పవన్ కుమార్(38) నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. వరుసకు బావమరిది అయ్యే జగన్ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. అతని అంత్యక్రియలకు వెళ్లలేకపోవడంతో భార్య కృష్ణ వేణితో కలిసి సోమవారం 7 గంటల ప్రాంతంలో మృతుడి ఇంటికి పరామర్శకు వెళ్లారు.
అప్పటికే జగన్ భార్య పవన్ కుమార్ చేతబడి చేయించడం వల్లనే తన భర్త చనిపోయాడని భావిస్తుంది. దీంతో పవన్ కుమార్ రాగానే అతనిపై దాడికి దిగింది. అక్కడే ఉన్న బంధువులంతా కలిసి ఇంటి పక్కన ఉన్న గదిలో పవన్ ను బంధించి బయట తాళం వేశారు. అనంతరం అతనిపై జగన్ భార్య పెట్రోల్ పోసి నిప్పంటించింది.
భార్య కళ్ళ ముందే పవన్ కుమార్ మంటల్లో సజీవదహనమయ్యాడు. మృతుడి భార్య పోలీసులకు సమాచారం ఇవ్వగా అప్పటికే పవన్ కాలిబూడిదయ్యాడు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసారు. ఈ ఘటనలో బంధువుల పాత్రపై ఆరా తీస్తున్నారు.