తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎఎస్సార్ తనయురాలు షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొత్త పార్టీ ఏర్పాటు కార్యక్రమాలలో వైఎస్ షర్మిల తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో షర్మిలతో పలువురు నేతలు భేటీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి సలహాదారుగా వ్యవహరించిన రామచంద్రమూర్తి షర్మిలను కలిసిన విషయం తెలిసిందే.
తాజాగా మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ షర్మిల పార్టీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన తన ప్రసంగాలతో కార్యకర్తలను ఉత్తేజపరచనున్నారని అంటున్నారు. ఈ వార్తల నేపథ్యంలో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో బ్రదర్ షఫీ షర్మిలతో భేటీ భేటీ అయ్యారు. మంచి మార్పుకోసమే షర్మిల రాజకీయాల్లోకి వస్తున్నారని బ్రదర్ షఫీ వ్యాఖ్యానించారు. ఆమెతో సుదీర్ఘ సమయం పాటు చర్చించానన్నారు. షర్మిలలో దివంగత నేత వైఎస్సార్ కనబడుతున్నారని, త్వరలోనే శుభవార్త వినబోతున్నారంటూ షఫీ కీలక వ్యాఖ్యలు చేసారు.
ఇదిలా ఉండగా షర్మిల పెట్టబోయే పార్టీకి సలహాదారులుగా మాజీ ఐఎస్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ ఉదయ సింహ ఉండనున్నారని సమాచారం. కాగా ఉదయ సింహ వైఎస్ హయాంలో సీఎస్వోగా పని చేసారు. సీఎంవో అడిషనల్ సెక్రటరీగా ప్రభాకర్ రెడ్డి పని చేసారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8న షర్మిల పార్టీ ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు జోరందుకున్నాయి.