కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల రూపంలో ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ చిక్కుల్లో పడేసింది. డిగ్రీ కాలేజీలకు అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. దీంతో విద్యార్థులంతా ఆన్ లైన్ లో తమకు కావలసిన కాలేజీలను ఎంచుకున్నారు. తీరా కాలేజీలకు వెళ్లి చూస్తే ఊహించని షాక్ తగిలింది.
వారు ఎంచుకున్నన్నమహిళా కాలేజీలని తెలిసి అవాక్కయ్యారు. అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలో ఉన్న కొన్ని మహిళా కాలేజీలు అడ్మిషన్ సమయంలో కో ఎడ్యుకేషన్ కాలేజీలుగా చూపించడంతో చాలా మంది విద్యార్థులు ఈ కాలేజీలను ఎంచుకున్నారు.
అడ్మిషన్ పొందిన తర్వాత కాలేజీలకు వెళ్లిన అబ్బాయిలకు ఇది మహిళా కళాశాల అని ప్రవేశం లేదని తెలపడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇప్పటికిప్పుడు మరో కాలేజీకి మారలేని పరిస్థితి. స్పాట్ అడ్మిషన్ పొందితే వారికి ప్రభుత్వ పథకాలు వర్తించవు. దీంతో ఎటూ తేల్చుకోలేక విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. కాగా ఇప్పటికే రెండు దశల్లో అడ్మిషన్లు ముగిసాయి. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా చర్యలు తీసుకుని తప్పులు సరిదిద్దుతామని హామీ ఇచ్చినట్టుగా సమాచారం.