మెగా బ్రదర్ నాగబాబు దూకుడు అందరికీ తెలిసిందే. అవతలి వారిపై విమర్శలు చేయడంలో ఆయనది రామ్ గోపాల్ వర్మ స్టైల్. ఒకరిని టార్గెట్ చేశారంటే వారి పని పడతారు. చిన్న చిన్న లాజిక్‌లతో మాట్లాడుతూ వారిని ఇబ్బంది పెడుతుంటారు. పైగా ఆయనకు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన క్యాడర్ రూపంలో భారీ సోషల్ మీడియా సైన్యం అండగా ఉంది. దీంతో ఆయన మరింత దూకుడుగా వెళుతుంటారు.
గతంలో బాలకృష్ణ, రాజశేఖర్, దర్శకుడు ఆర్జీవీని నాగబాబు ఇలానే టార్గెట్ చేశారు. తాజాగా ఆయన వైసీపీ శ్రేణులతో తలపడుతున్నారు. జీ తెలుగు ఛానల్లో నాగబాబు బొమ్మ అదిరింది అనే కామెడీ షో నిర్వహిస్తారు. ఈ షో మొత్తం ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఈ కామెడీ షోలో ఇటీవల గల్లీ బాయ్స్ టీమ్ ఒక స్కిట్ వేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ఇమిటేట్ చేస్తూ రియాజ్ వేసిన ఈ స్కిట్ వివాదాస్పదమైంది.
జగన్‌ను కించరుస్తున్నట్లు ఈ స్కిట్ ఉందని భావించిన జగన్ ఫ్యాన్స్ ఈ ప్రోగ్రాంలో నటులను, నాగబాబును ట్రోల్ చేశారు. స్కిట్ వేసిన నటులు వెంటనే తగ్గి జగన్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. కానీ, నాగబాబు మాత్రం వెనక్కు తగ్గలేదు. పైగా జగన్ అభిమానుల కోపం రెట్టింపయ్యేలా ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. ఇది కాస్తా వైసీపీ వర్సెస్ జనసేన క్యాడర్ వార్‌గా సోషల్ మీడియాలో మారిపోయింది.
అదిరింది ప్రోగ్రాం ప్రసారమయ్యే జీ తెలుగు ఛానల్‌పైన కూడా జగన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత జీ తెలుగు వారు ఆంధ్రప్రదేశ్‌కు భారీగా ఆంబులెన్స్‌లు, పీపీఈ కిట్లు విరాళంగా ఇవ్వడంతో ఛానల్‌పై జగన్ అభిమానుల కోపం చల్లారింది. పాత స్కిట్ వివాదం అలా నడుస్తుండగానే అదే అదిరింది ప్రోగ్రామ్‌లో అదే గల్లీ బాయ్స్ మరో వివాదాస్పద స్కిట్ వేసింది.
జగన్‌ను ఇమిటేట్ చేసిన వివాదం చల్లారకముందే వీరు సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిని ఇమిటేట్ చేశారు. అయితే, ఈ స్కిట్ ద్వారా నాగబాబు ఒక సందేశం ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి షోలలో ప్రముఖులను ఇమిటేట్ చేయడం సహజమేనని, దీనిని సీరియస్‌గా తీసుకోవద్దని ఆయన ఈ స్కిట్ ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా చెబుతున్నారు. టీడీపీ వాళ్లు అభిమానించే ఎన్టీఆర్, తన అన్న చిరంజీవిని కూడా ఇమిటేట్ చేసినా తప్పు లేదనే మెసేజ్ ఆయన ఇస్తున్నారు. జగన్ స్కిట్‌ను ఈ కొత్త స్కిట్లోకి ఎన్టీఆర్, చిరంజీవిని తెచ్చి నాగబాబు లెవల్ చేశారు.