logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?

చైనాలో పుట్టి ప్ర‌పంచాన్ని అంత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా వైర‌స్ గురించి ఆలోచిస్తే మ‌న‌కు 2011లో విడుద‌లైన సెవెన్త్ సెన్స్ సినిమా గుర్తుకు వ‌స్తుంది. ఏఆర్ మురుగ‌దాస్ తెర‌కెక్కించిన ఈ సినిమాలోనూ ఓ వైర‌స్ ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడుతుంటే బోది ధ‌ర్ముడు వ‌చ్చి మందు క‌నిపెట్టి వైర‌స్‌ను అంతం చేస్తాడు. ద‌క్షిణ భార‌తం నుంచి చైనా వెళ్లిన బోది ధ‌ర్ముడు అక్క‌డి ప్ర‌జ‌ల‌కు నాటు వైద్య‌, యుద్ధ విద్య‌లు నేర్పిస్తాడు. దీంతో బోది ధ‌ర్ముడిని చైనా ప్ర‌జ‌లు దైవంగా భావిస్తుంటారు.

అయితే, భార‌తీయుడై చైనా ప్ర‌జ‌ల‌కు దైవంలా మారిన బోది ధ‌ర్ముడి గురించి మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. ఈ సినిమా వ‌ల్ల‌నే బోది ధ‌ర్ముడి పేరు అంద‌రికీ తెలిసింది. ఇప్ప‌టికే బోది ధ‌ర్మ అనేది ఒక సినిమా క్యారెక్టరా లేదంటే నిజాంగా బోధి ధ‌ర్ముడు ఇక్క‌డి నుంచి చైనాకు వెళ్లాడా అనే అనుమానాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. ఇదే కాకుండా బోది ధ‌ర్ముడి మ‌ర‌ణం కూడా పెద్ద మిస్ట‌రీనే. ఆయ‌న‌ను చైనీయులు హ‌త‌మార్చారనే క‌థ ఒక వైపు ఉండ‌గా కాదు ఆయ‌న చైనా నుంచి భార‌త్‌కు వ‌చ్చేశాడ‌నే క‌థ కూడా ఉంది. అస‌లు బోది ధ‌ర్ముడి క‌థ ఏంటి ? ఆయ‌న మ‌ర‌ణ ర‌హస్యం ఏంటో ఒక‌సారి తెలుసుకుందాం.

చ‌రిత్ర‌కారులు చెబుతున్న దానిని బ‌ట్టి.. బోది ధ‌ర్ముడి అస‌లు పేరు ధ‌ర్మ వ‌ర్మ‌. ఐదో శ‌తాబ‌ద్ధంలో త‌మిళ‌నాడులోని కాంచీపురాన్ని పాలిస్తున్న ప‌ల్ల‌వ‌ రాజు స్కంద‌వ‌ర్మ‌కు ధ‌ర్మ వ‌ర్మ మూడో సంతానం. ఆయ‌న త‌మిళవాడా లేదా తెలుగువాడా అనే దానిపై కూడా భిన్న వాద‌న‌లు ఉన్నాయి. ఈ విష‌యాన్ని ప‌క్క‌నపెడితే బోది ధ‌ర్మ చైనాకు వెళ్ల‌డం వెనుక ఆస‌క్తిక‌ర క‌థ ఉంది. ఓ రోజు బౌద్ధ స‌న్యాసి ప్ర‌జ్ఞ‌‌తార స్కంద వ‌ర్మ కోట‌కు వ‌చ్చాడు. అక్క‌డ నీలి రంగు క‌ళ్లు, ధృడ‌మైన శ‌రీరంతో క‌నిపించిన ధ‌ర్మ‌వ‌ర్మ‌ను, ఆయ‌న కండ‌బ‌లాన్ని, బుద్ధిబ‌లాన్ని చూసిన ప్ర‌జ్ఞ‌తార ధ‌ర్మ వ‌ర్మ‌కు ఒక లేఖ ఇచ్చాడు.

జ‌న‌నానికి ముందు నీవెవ్వ‌రు ? జ‌న్మించిన త‌ర్వాత నీవెవ్వ‌రూ అని ఆ లేఖ‌లో రాసి ఉంది. దీనికి స‌మాదానం వెతికేందుకు ధ‌ర్మ‌వ‌ర్మ ఎంతో ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యాడు. చివ‌ర‌కు ప్ర‌జ్ఞాత‌ర ఆశ్ర‌మానికి వెళ్లి స‌మాదానం చెప్పాల‌ని కోరాడు. అయితే, ఈ స‌మాదానం నీకు నువ్వు వెతుక్కోవాల‌ని, బంధాలు, సుఖాలు, అధికారాల‌ను వీడి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తే స‌మాదానం దొరుకుతుంద‌ని చెప్పాడు. ప్ర‌జ్ఞాతార మాట‌ల‌కు ప్ర‌భావిత‌మైన ధ‌ర్మ వ‌ర్మ ఆయ‌న‌కు శిష్యుడిగా మారిపోయాడు. అప్పుడే ధ‌ర్మ వ‌ర్మ పేరును బోది ధ‌ర్మ‌గా ప్ర‌జ్ఞాతార మార్చాడు.

40 ఏళ్ల పాటు ప్ర‌జ్ఞాతార‌కు బోది ధ‌ర్మ శిష్యుడిగా కొన‌సాగాడు. బోది ధ‌ర్ముడిగా బౌద్ధ మ‌తం గురించి అన్ని విష‌యాల‌ను బోధించాడు. యుద్ధ‌విద్య‌లతో పాటు అనేక అంశాల్లో బోది ధ‌ర్ముడిని ప్ర‌జ్ఞాత‌ర ప్రావీణ్యుడిని చేశాడు. అన్ని విధాలుగా బోది ధ‌ర్ముడు ఒక గొప్ప బుద్ధిశీలిగా, యోధుడిగా మారిన త‌ర్వాత ఆయ‌న‌ను బౌద్ధ మ‌త వ్యాప్తి కోసం పంపించాల‌ని ప్ర‌జ్ఞాత‌ర భావించాడు. ఇందుకోసం చైనాకు బోది ధ‌ర్ముడిని చైనా వెళ్లాల‌ని ఆదేశించాడు. నిజానికి చైనాలో అప్ప‌టికే బౌద్ధ‌మ‌తం ఉంది. కానీ, ప్ర‌జ‌లకు మ‌తాచారాల గురించి స‌రిగ్గా తెలియ‌దు.

అప్ప‌టికే బోది ధ‌ర్ముడు కూడా వృద్ధాప్యానికి ద‌గ్గ‌ర‌వుతున్నాడు. 67 ఏళ్ల వ‌య‌స్సులో ఉత్త‌ర చైనా వెళ్లాడు. మొద‌ట చైనీయులు బోది ధ‌ర్ముడిని ద్వేషించారు. వారు ఆయ‌న‌ను బౌద్ధ గురువుగా కాకుండా ఒక భార‌తీయుడినే చూశారు. దూరంగా ఉన్నారు. క‌నీసం ఆయ‌న‌కు ఆశ్ర‌యం కూడా క‌ల్పించ‌లేదు. దీంతో అడ‌విలోని ఓ గుహ‌లో బోది ధ‌ర్ముడు ద్యానంలో మునిగిపోయాడు. క‌ఠోర ద్యానంలో ఉన్న బోది ధ‌ర్ముడి గురించి దాజూ ల్యూక్ అనే ఒక వ్య‌క్తి తెలుసుకొని శిష్యుడిగా చేర‌తాడు.

ఒకే గుహ‌లో తొమ్మిదేళ్లు ద్యానంలో గ‌డిపిన బోది ధ‌ర్ముడి గురించి క్ర‌మంగా చైనా మొత్తం తెలిసింది. క్ర‌మంగా చైనీయులు ఆయ‌న‌ను గౌర‌వించ‌డం, ఆరాధించ‌డం మొద‌లుపెట్టారు. వారికి బోది ధ‌ర్ముడు బౌద్ధ మ‌తాచారాల‌ను, బుద్ధుడి బోధ‌న‌ల గురించి బోధించాడు. తాను భార‌త‌దేశంలో నేర్చుకున్న యుద్ధ‌విద్య‌ల‌ను చైనీయుల‌కు నేర్పించారు. మౌలికా వైద్య విధానం బోధించారు. బోది ధ‌ర్మ‌ను 28వ బౌద్ధ ఆచార్యుడిగా గుర్తించిన చైనీయులు ఆయ‌న‌ను దాము అని పిలుచుకునే వారు. జ‌పాన్‌లో ధ‌ర్మ అనే వారు.

త‌న గురువు త‌న‌కు అప్ప‌గించిన అన్ని ప‌నుల‌ను పూర్తి చేసుకున్న బోది ధ‌ర్ముడు తిరిగి తన భార‌త‌దేశానికి రావాల‌ని అనుకున్నారు. షేన్ గ్యాంగ్ అనే త‌న శిష్యుడిని బౌద్ధ గురువుగా ప్ర‌క‌టించారు. అయితే, బోది ధ‌ర్ముడు త‌మ ద‌గ్గ‌రే మ‌ర‌ణిస్తే ఆయ‌న శ‌క్తులు అన్ని త‌మ ప్రాంతానికే ప‌రిమితం అవుతాయ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు భావించారు. ఆయ‌న‌ను ఇక్క‌డే హ‌త్య చేయాల‌ని కుట్ర ప‌న్నారు. ఆహారంలో విష‌యం పెట్టి హ‌త్య చేశారు. అక్క‌డే ఓ ప‌ర్వ‌తంపై ఆయ‌న‌ను పూడ్చిపెట్టారు.

కానీ, బోది ధ‌ర్మ మ‌ర‌ణించ‌లేద‌ని, ఆయ‌న తిరిగి స్వ‌దేశానికి వ‌చ్చాడ‌నే మ‌రో క‌థ కూడా ఉంది. ఆయ‌న ఒక చెప్పు ప‌ట్టుకొని ఆ దేశం దాటుతుంటే ఒక సైనికుడు చూసి రాజుకు చెబుతాడు. ఆ రోజు బోది ధ‌ర్ముడి స‌మాదిని త‌వ్వి చూడ‌గా ఒకే చెప్పు మాత్ర‌మే ఉంటుంది. దీంతో బోది ధ‌ర్ముడికి మ‌ర‌ణం లేద‌ని, ఆయ‌న బ‌తికే ఉన్నార‌ని చైనీయులు భావిస్తుంటారు. ఇప్ప‌టికీ బోది ధ‌ర్ముడి మ‌ర‌ణం ఒక మిస్ట‌రీగానే మిగిలిపోయింది. బోది ధ‌ర్ముడికి చైనా, జ‌పాన్‌లో అనేక విగ్ర‌హాలు ఉన్నాయి. ఇప్ప‌టికే యుద్ధ విద్య‌లు నేర్చుకునేట‌ప్పుడు అక్కడి వారు బోది ధ‌ర్మ‌ను త‌లుచుకుంటారు. అయితే, ఇప్పుడు మ‌నం చెప్పుకున్న‌దంతా ఎక్కువ‌గా ప్ర‌చారంలో ఉన్న క‌థ‌. కానీ, ఆయ‌న జీవితానికి సంబంధించి మ‌రికొన్ని క‌థ‌లు కూడా ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే, ద‌క్షిణ దిక్కు నుంచి ఒక స‌న్యాసి చైనాకు వ‌చ్చి వారి గురువుగా మారాడ‌నేది మాత్రం అంద‌రూ అంగీక‌రించే నిజం.

Related News