మనదేశంలో డయాబెటిస్ భారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఓ అధ్యయనం ప్రకారం భారత్ లో ఈ వ్యాధి బారిన పడిన వారు 70 మిలియన్ల దాకా ఉంటారని అంచనా. అయితే డయాబెటిస్ అనేది ఒక జీవన శైలి వ్యాధి అన్న విషయం తెలిసిందే. ఒక్కసారి ఈ వ్యాధి సోకితే ఇక జీవితాంతం మందులు వాడుతూ దానితో సహజీవనం చేయాల్సిందే. అయితే మన ఆహారపు అలవాట్లు, జీవన శైలిపై కొంచెం శ్రద్ద వహిస్తే డయాబెటిస్ భారిన పడకుండా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటె డయాబెటిస్ కు బ్లడ్ గ్రూపుకు ఏదైనా సంబంధం ఉందా? ఏ బ్లడ్ గ్రూపు వారికి షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ? అనే విషయంపై ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 2014 లో డయాబెటోలాజియాలో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. ‘ఓ’ బ్లడ్ గ్రూపు వారితో పోలిస్తే మిగతా బ్లడ్ గ్రూపుల వారికి చక్కర వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని తేలింది. అంటే ఓ బ్లడ్ గ్రూపు వారికి డయాబెటిస్ రిస్క్ తక్కువ.
యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ జర్నల్ 80 వేల మంది మహిళలను పరీక్షించి వారిలో టైపు 2 డయాబెటిస్ ఉన్నవారిని గుర్తించారు. 80 వేల మందిలో 3553 మంది మహిళలకు టైపు 2 డయాబెటిస్ ఉన్నట్టుగా తేల్చారు. వీరిలో అధిక శాతం నాన్ ‘ఓ’ బ్లడ్ గ్రూపు వారేనని నిర్దారించారు.
ఈ అధ్యయనం ప్రకారం.. ‘ఓ’ బ్లడ్ గ్రూపు వారితో పోలిస్తే ‘ఏ’ బ్లడ్ గ్రూపు మహిళలకు డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉంది. అలాగే ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వారితో పోలిస్తే ‘బి’ బ్లడ్ గ్రూపు వారు టైపు 2 మధుమేహం వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని తేలింది. అందుకు కారణం ‘విల్లే బ్రాండ్’ అనే అనే ఓ రకమైన ప్రోటీన్ ‘ఓ’ బ్లడ్ గ్రూపు కాని వారిలో ఎక్కువగా ఉంటుందని అందుకే వాళ్లకు షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
అయితే ఇందుకు సంబంధించిన మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. ఇక ఎలాంటి బ్లడ్ గ్రూపు వారైనా సరే షుగర్ లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోజులో కొంత సమయం శారీరక వ్యాయామానికి కేటాయించాల్సిందే. అలాగే తినే ఆహరం పై శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఈ రెండు మార్పులు చేసుకుంటే శరీరంలో చక్కర స్థాయిలను నియంత్రించుకోగలుగుతాము. తద్వారా డయాబెటిస్ బారిన పడే అవకాశమే ఉండదు.