ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి. జగన్ ఢిల్లీ టూర్లు, బీజేపీ పెద్దలతో వరుస భేటీలతో ఎన్టీఏలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరబోతోందా అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తమతో కలుపుకునేందుకు బీజేపీ ముందునుంచీ ఆసక్తితో ఉంది. 2014 ఎన్నికల ముందు ఎన్టీఏలోకి రావాల్సిందిగా బీజేపీ జగన్‌ను ఆహ్వానించింది. కానీ, ఒంటరిగా పోటీ చేస్తామని అప్పుడు జగన్ అనడంతో తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి చేర్చుకొని ఆంధ్రప్రదేశ్‌లోకి అధికారంలోకి వచ్చారు.
2018లో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాత బీజేపీకి, వైసీపీ మధ్య కొంత సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే, బీజేపీ మీద అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం, ఒంటరిగా పోటీ చేసినా వైసీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన తర్వాత మరోసారి ఆ పార్టీని బీజేపీ ఎన్డీఏలోకి ఆహ్వానించిందనే వార్తలు వచ్చాయి.
ఒక కేంద్ర మంత్రి పదవి, రెండు సహాయ మంత్రి పదవులను ఇస్తామని ఆఫర్ చేసిందట. కానీ, ఈ ప్రతిపాదనను జగన్ సున్నితంగా తిరస్కరించారని చెబుతారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకోమని చెప్పినా కూడా వైసీపీ వద్దని చెప్పిందని వార్తలు వచ్చాయి. ఎన్డీఏలో లేకపోయిన బీజేపీతో సత్సంబంధాలు నెరపుతోంది వైసీపీ. ఇప్పుడు మరోసారి వైసీపీని ఎన్డీఏలోకి రావాలని, కేంద్ర క్యాబినెట్లో భాగం కావాలని బీజేపీ పెద్దలు పిలిచినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఎన్డీఏలో భాగస్వాములుగా, అనేక ఏళ్లుగా బీజేపీకి మిత్రులుగా ఉంటున్న శివసేన, అకాలీదళ్ పార్టీలు ఇప్పుడు ఎన్డీఏను వీడాయి. ఇప్పుడు ఎన్డీఏలో ఒక్క బలమైన ప్రాంతీయ పార్టీ కూడా లేదు. దీంతో ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి 22 లోక్‌సభ, 6 రాజ్యసభ సీట్లతో బలమైన పార్టీగా ఉన్న వైసీపీని బీజేపీ కేంద్ర మంత్రివర్గంలోకి ఆహ్వానించిందని జాతీయ మీడియా అంటోంది. ఈ వార్తలకు ఇటీవల జరుగుతున్న పరిణామాలు మరింత తావిస్తున్నాయి.
జగన్‌పైన, జగన్ ప్రభుత్వ పనితీరుపైన, కోర్టులతో పెట్టుకుంటున్న కయ్యాలపైన కేంద్రం సీరియస్‌గా ఉందని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా కొంతకాలంగా చెబుతోంది. ఇటీవల జగన్‌ను ఢిల్లీకి పిలిచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీవాట్లు పెట్టారని కూడా ఆ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలా జరగడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే… కరోనా బారిన పడి కోలుకుంటున్న సమయంలోనే జగన్‌ను వరుసగా రెండురోజులు కలిశారు అమిత్ షా.
గంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. తర్వాత కరోనాపైన జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ ప్రభుత్వ పనితీరుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఇప్పుడు జగన్‌కు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. ఆయన ప్రధానిని కలవనున్నారు. వైసీపీ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీని ఎన్డీఏలోకి చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉంది. మరోవైపు రాష్ట్రంలో పాలన సాఫీగా సాగాలన్నా, ఆర్థిక లోటు నుంచి బయటకు రావాలన్నా కేంద్రం అండ వైసీపీకి అవసరం.
ఇలా ఉభయుల ప్రయోజనాలరీత్యా ఎన్డీఏలోకి వైసీపీని ఆహ్వానించే అవకాశాలను, వైసీపీ కేంద్ర మంత్రివర్గంలోకి చేరే అవకాశాలను కొట్టిపారేయలేం. అయితే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాననేది జగన్ ప్రధానంగా ప్రజలకు ఇచ్చిన హామీ. ఈ హామీ నెరవేరకుండానే కేంద్ర ప్రభుత్వంలో చేరితే జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావచ్చు. కాబట్టి, ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లుగా ఎన్డీఏలో వైసీపీ చేరాలంటే ముందు ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ, బీజేపీ ఒక కొలిక్కి తీసుకురావాల్సి ఉంటుంది.