దేశంలో కొత్త కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో ఒకటి హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ అనే సంస్థ అభివృద్ధి చేస్తున్న కార్బివాక్స్ అనే వ్యాక్సిన్. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. అయితే, దేశంలో అతి తక్కువ ధరకు ఈ వ్యాక్సిన్ లభించనున్నట్లు జాతీయ మీడియా ఒక వార్త ప్రచురించింది. ఈ వార్తల ప్రకారం.. ప్రస్తుం దేశంలో ఉన్న కోవాక్సిన్, కోవీషీల్డ్, స్పుత్నిక్ వి కంటే ఈ కార్బివాక్స్ ధర తక్కువగా ఉండనుంది.
బయోలాజికల్ ఇ సంస్థ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనుంది. మూడు రకాల వ్యాక్సిన్లు 30 కోట్ల డోసులను డిసెంబర్ నాటికి ఉత్పత్తి చేయడానికి గానూ కేంద్ర ప్రభుత్వంతో ఈ సంస్థ ఒక ఒప్పందం చేసుకుంటోంది. కేంద్రం అడ్వాన్స్‌గా 1500 కోట్లు ఇవ్వనుంది. ఈ మూడు రకాల వ్యాక్సిన్లలో రెండు ఇతర దేశాలకు చెందినవి కాగా ఒక వ్యాక్సిన్ కార్బివాక్స్ వ్యాక్సిన్‌ను బయోలాజికల్ ఇ సంస్థనే అమెరికాకు చెందిన బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి అభివృద్ధి చేసింది.
ఈ వ్యాక్సిన్ రెండు డోసులకు రూ.500 ఉంటుందని తెలుస్తోంది. అంటే ఒక్క డోసు కేవలం రూ.250కే అందుబాటులోకి రానుంది. మరి, ప్రైవేటు, ప్రభుత్వానికి ఒకే ధరకు ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా ధరను బయోలాజికల్ ఇ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రూ.500కే రెండు డోసుల వ్యాక్సిన్ ఇస్తే మాత్రం ఒక సంచలనం లాంటిదే.
ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లలో కోవాక్సిన్ రెండు డోసులకు గానూ ప్రభుత్వానికి రూ.800లకు , ప్రైవేటు వారికి రూ.2400కు ఇస్తోంది. ఇక కోవీషీల్డ్ విషయానికి వస్తే.. రెండు డోసులకు గానూ ప్రభుత్వాలకు రూ.600లకు, ప్రైవేటు వారికి రూ.1200కు ఇస్తున్నారు. డాక్టర్ రెడ్డీస్ దిగుమతి చేసుకుంటున్న స్పుత్నిక్ వి ధర ప్రస్తుతం ఒక్క డోసుకు రూ.995గా నిర్ణయించారు. ఒకవేళ బయోలాజికల్ ఇ కనుక రూ.500లకే రెండు డోసులు ఇస్తే ఇదే చవకైన వ్యాక్సిన్ అనుకోవాలి.
కానీ, గతంలో మిగతా సంస్థలు కూడా తాము తక్కువ ధరలకు వ్యాక్సిన్ ఇస్తామని ముందు ప్రకటించి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ధరను విపరీతంగా పెంచేశాయి. వాటర్ బాటిల్ ధర కన్నా తక్కువకు కోవాక్సిన్ ఇస్తామని చెప్పి అత్యధిక రేటుకు విక్రయిస్తున్నారు. కోవీషీల్డ్ ధర కొంచెం అదుపులోనే ఉన్నా కూడా చెప్పన దాని కంటే ఎక్కువే ఉంది. మరి, బయోలాజిక్ ఇ సంస్థ ధర విషయంలో ఎలా ఉంటుందో చూడాలి.