ఎట్టి పరిస్థితుల్లో తన హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలగా ఉన్న ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంతం నెగ్గించుకున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఈ నెల 11న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని, ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
హైకోర్టు తాజా తీర్పుతో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నెల 23 నుంచి నోటిఫికేషన్లు విడుదల చేసి ఫిబ్రవరి 4 నుంచి నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని ఎన్నికల సంఘం చెబుతోంది.
అయితే, హైకోర్టు తాజా తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ యుద్ధప్రాతిపదికన జరుగుతున్నందున, ప్రభుత్వ యంత్రాంగమంతా ఈ ప్రక్రియలోనే ఉన్నందున ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.