బోయిన్‌పల్లిలో నిన్ రాత్రి జరిగిన కిడ్నాప్ కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్‌పల్లికి చెందిన ప్రవీణ్ రావు, అతని సోదరులు నవీన్ రావు, సునీల్ రావులతో అఖిలప్రియకు భూవివాదం నడుస్తోంది. ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి ఉన్నప్పటి నుంచి ఈ వివాదం నడుస్తోంది.
ఈ క్రమంలో నిన్న రాత్రి ప్రవీణ్ రావు ఇంటికి కొందరు కిడ్నాపర్లు ఐటీ అధికారుల పేరుతో చొరబడ్డారు. సోదాల పేరుతో వీరి ఇంట్లో నుంచి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ రావు కుటుంబసభ్యులను ఒక రూమ్‌లో బంధించి ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావును బలవంతంగా కిడ్నాప్ చేసి తమతో పాటు తీసుకెళ్లారు.
కారులో తీసుకెళ్లి బలవంతంగా కిడ్నాపర్లు కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. ఇవాళ తెల్లవారు జామున కిడ్నాపర్లు వీరిని వదిలేశారు. కిడ్నాపర్లలో మాజీ మంత్రి అఖిలప్రియ మరిది చంద్రహాస్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కిడ్నాప్ వెనుక అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ ఉన్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు అఖిలప్రియను అరెస్ట్ చేసి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమె భర్త భార్గవ్‌రామ్ పరారీలో ఉన్నాడు. ఆళ్లగడ్డకు చెందిన 15 మంది మనుషులతో అఖిలప్రియ ఈ కిడ్నాప్ చేయించిందని తెలుస్తోంది. కాగా, కిడ్నాప్‌కు గురైన వారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దగ్గర బంధువులు.