మొదటి స్వదేశీ కరోనా వ్యాక్సిన్ అయిన కోవాగ్జిన్‌ను అందించిన భారత్ బయోటెక్ సంస్థ మరో కొత్త కరోనా వ్యాక్సిన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తోంది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ ఇప్పటికే దేశంలో పెద్ద ఎత్తున పంపిణీ జరుగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగంగా, సులువుగా జరిగేందుకు వీలుగా భారత్ బయోటెక్ సంస్థ ఈ కొత్త వ్యాక్సిన్‌ను తయారుచేసింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కరోనా వ్యాక్సిన్ల కంటే ఈ కొత్త వ్యాక్సిన్ చాలా ప్రత్యేకం. ఇప్పటివరకు అన్ని కరోనా వ్యాక్సిన్లు ఇంజక్షన్ల రూపంలో అందించాల్సినవే ఉన్నాయి. కానీ, భారత్ బయోటెక్ కొత్త కరోనా వ్యాక్సిన్ మాత్రం ముక్కు ద్వారా వేస్తారు. ఇది పోలియో నివారణలో భాగంగా వేసే చుక్కల మందు లాగానే ఉంటుంది. ముక్కు ద్వారా వేస్తారు. ఈ వ్యాక్సిన్‌ను తాత్కలికంగా బీబీవీ154 అనే పేరుతో పిలుస్తున్నారు. ఇంకా శాశ్వత పేరు పెట్టలేదు.
అమెరికాలోని సెయింట్ లూయిస్ వాషింగ్టన్ యూనివర్సిటీ అందిస్తున్న సాంకేతిక సహకారంతో భారత్ బయోటెక్ సంస్థ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఈ ముక్కు వ్యాక్సిన్ మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. ఈ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ పనితీరుపై మంచి ఫలితాలు రావడంతో పూర్తి డేటాను పరిశీలించిన తర్వాత దీంతో 2వ, 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ముక్కు ద్వారా అందించే కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. కొన్ని క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. మన దేశంలో మాత్రం ముక్కు ద్వారా అందించే కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ వరకు రావడం ఇదే మొదటిసారి. ఒకవేళ క్లినికల్ ట్రయల్స్‌లో ఫలితాలు బాగుంటే అతి త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ఇదే జరిగితే దేశంలో వ్యాక్సిన్ ఇవ్వడం మరింత వేగవంతంగా, సులువుగా పూర్తవుతుంది.