logo

  BREAKING NEWS

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |   అసెంబ్లీలో రగడ: చంద్రబాబు సహా టీడీపీ సభ్యుల సస్పెండ్!  |   కరోనా పుట్టింది ఎక్కడో కాదు భారత్ లోనే..? చైనా సంచలన ఆరోపణలు!  |   అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |  

మీ పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ స్థాయి హాస్ట‌ల్‌తో కూడిన‌ విద్య కావాలా

త‌మ పిల్ల‌ల‌కు న‌వోద‌య విద్యాల‌య‌లో సీటు రావాల‌నేది చాలామంది త‌ల్లిదండ్రుల‌కు ఒక క‌ళ లాంటిది. ఇక్క‌డ నాణ్య‌మైన విద్య అందిస్తార‌నేది అంద‌రి న‌మ్మ‌కం. పైగా ఉచిత హాస్ట‌ల్ వ‌స‌తి కూడా ఉంటుంది. న‌వోద‌యలో సీటు కోసం పిల్ల‌లు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతుంటారు. ఒక‌సారి న‌వోద‌య‌లో త‌మ పిల్ల‌ల‌కు సీటు వ‌చ్చిందంటే ఇక వారి భ‌విష్య‌త్ గురించి ఎటువంటి బెంగ అవ‌స‌రం లేద‌నేది త‌ల్లిదండ్రుల భావ‌న‌.

ఇంత‌లా త‌ల్లిదండ్రుల న‌మ్మ‌కాన్ని చూర‌గొన్న న‌వోద‌య‌ విద్యాల‌య‌లో 2021 – 2022 సంవ‌త్స‌రానికి కూడా ప్ర‌వేశాల కోసం న‌వోద‌య విద్యాల‌య స‌మితి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభించింది. భార‌త ప్ర‌భుత్వ విద్యా మంత్రిత్వ శాఖ‌లోని పాఠ‌శాల విద్య మ‌రియు అక్ష‌రాస్య‌త విభాగంలోని స్వ‌యం ప్ర‌తిప‌త్తి గ‌ల సంస్థ ఇది. దేశ‌వ్యాప్తంగా న‌వోద‌య విద్యాల‌యాల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు న‌వోద‌య విద్యాల‌య స‌మితినే చూసుకుంటుంది. ప్ర‌తీ సంవ‌త్స‌రం అర్హ‌త ప‌రీక్ష నిర్వ‌హించి సీట్లు కేటాయిస్తుంది.

వ‌చ్చే విద్యా సంవత్స‌రానికి సంబంధించిన ఎంట్రెన్స్ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం ఉంది. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ అక్టోబ‌రు 22, 2020 నాడు ప్రారంభ‌మైంది. డిసెంబ‌ర్ 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకునేందుకు గ‌డువు ఉంది. ద‌ర‌ఖాస్తుల‌కు సంబంధించి న‌వోద‌య విద్యాల‌య స‌మితి కొన్ని అర్హ‌త‌లు పెట్టింది.

ఎక్క‌డైతే న‌వోద‌య విద్యాల‌య న‌డుస్తున్న‌దో అదే జిల్లాలోని ఏదైనా ప్ర‌భుత్వ లేదా ప్ర‌భుత్వం చేత గుర్తింపు పొందిన పాఠ‌శాల‌లో 2020 – 2021 విద్యా సంవ‌త్స‌రంలో ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతూ ఉండాలి. ఇప్ప‌టికే మూడు, నాలుగో త‌ర‌గ‌తుల పూర్తి విద్యా సంవ‌త్స‌రం చ‌దివి ఉత్తీర్ణ‌లై ఉండాలి. ఏ జిల్లా న‌వోద‌య‌లో ప్ర‌వేశం కోరుతున్నారో అదే జిల్లాలో ఐదో త‌ర‌గ‌తి చ‌ద‌వాల్సి ఉంటుంది. 2008 మే 1 నుంచి 2012 ఏప్రిల్ 30వ తేదీ లోపు జ‌న్మించి ఉండాలి.

న‌వోదయ విద్యాల‌య‌లో ప్ర‌వేశాల‌కు రిజ‌ర్వేష‌న్ కూడా వ‌ర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల‌లోని పాఠ‌శాల‌ల విద్యార్థుల కోసం క‌నీసం 75 శాతం సీట్లు రిజ‌ర్వ్ అయ్యి ఉంటాయి. బాలిక‌ల కోసం మూడింట ఒక‌టో వంతు సీట్లు రిజ‌ర్వేష‌న్ ఉంటుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం కూడా కేంద్ర ప్ర‌భుత్వ నియ‌మాల ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్ వ‌ర్తిస్తుంది.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల‌కు ఉచిత హాస్ట‌ల్ వ‌స‌తితో కూడా నాణ్య‌మైన విద్య న‌వోద‌య విద్యాల‌యాల్లో ల‌భిస్తుంది. బాల‌బాలిక‌ల‌కు వేర్వేరుగా హాస్ట‌ల్ వ‌స‌తి ఉంటుంది. చ‌దువుతో పాటు క్రీడ‌లు, ఆట‌ల్లోనూ ప్రోత్స‌హిస్తారు. ఎన్‌సీసీ, స్కౌట్స్ ఆండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్ వంటి వాటిలో పిల్ల‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తారు. న‌వోద‌య విద్యాల‌యాల్లో నాణ్య‌మైన విద్య అందుతోంద‌న‌డానికి గ‌త ఫ‌లితాలే నిద‌ర్శ‌నం.

గ‌త విద్యా సంవ‌త్స‌రంలో ప‌దో త‌ర‌గ‌తిలో 98.66 శాతం, ప‌న్నెండో త‌ర‌గ‌తిలో 98.70 శాతం మంది న‌దోవ‌య విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. జేఈఈ మెయిన్స్ 2019లో 38 శాతం మంది, జేఈఈ మెయిన్స్ 2020లో 43 శాతం మంది న‌వోద‌య విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. అంటే, ప్రైవేటు, కార్పొరేట్ పాఠ‌శాల‌ల‌కు ధీటుగా న‌వోద‌య‌లో విద్యాబోధ‌న ఉంటుంది. త‌ల్లిదండ్రులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకొని త‌మ పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్ ఇచ్చే అవ‌కాశం ఉంది. న‌వోద‌య‌లో ప్ర‌వేశాల కోసం 2021 ఏప్రిల్ 10న ప్ర‌వేశ ప‌రీక్ష జ‌రుగుతుంది.

Related News