కరోనా లాక్ డౌన్ కారణంగా ఐపీఎల్ 2020 పై సస్పెన్స్ కొనసాగుతుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 29న జరగాల్సిన ఐపీఎల్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ రావడం క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. ఆస్ట్రేలియాలో జరగనున్నటీ 20 వరల్డ్ కప్ వాయిదా పడితే ఆ విండోలో ఐపీఎల్ ను నిర్వహిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఐసీసీ ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది.
తాజాగా అనేక దేశాలు లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహిస్తారనే వాదన బలంగా వినిపిస్తుంది. తాజాగా బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్ పై స్పందించారు. ‘సురక్షిత వాతావరణంలో ఐపీఎల్ ను నిర్వహించడం సాధ్యమైతే మా తొలి ప్రాధాన్యత భారత్ లోనే. ప్లేయర్ల భద్రతపై అనుమానాలుంటే మాత్రం విదేశాల్లో లీగ్‌ను నిర్వహించే విషయం గురించి ఆలోచిస్తామ’ని తెలిపారు.
కరోనా అదుపులో ఉండడం వల్ల తమ దేశంలో ఐపీఎల్ ను నిర్వహించాలని శ్రీలంక, దక్షిణాఫ్రికా దేశాలు కోరినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అదంత సులభమైన విషయం కాదని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహించడం కొత్తేమి కాదని గతంలో రెండు సార్లు ఇదే విధంగా నిర్వహించామని అయన గుర్తు చేసారు. కానీ నూటికి నూరు శాతం ఈ టోర్నీని భారత్ లో నిర్వహించడానికి తాము మొగ్గు చూపుతున్నామన్నారు. ఇక జూన్ 10 తరువాతనే ఐపీఎల్ పై బీసీసీఐ తుది నిర్ణయం ప్రకటించే ఆవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.