పాకిస్థాన్ భారత్ పై ఎలాంటి ఉగ్ర దాడులకు పాల్పడదని హామీ ఇప్పించగలరా అంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కు బీసీసీఐ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. 2021 టీ20, 2023 వన్డే ప్రపంచ కప్ లలో భారత్ లో ఆడే తమ ఆటగాళ్ల భద్రతకు బీసీసీఐ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని పీసీబీ ఐసీసీ ని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా స్పందించారు.
పీసీబీ సీఈవో వసీమ్ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాలు క్రికెట్ బోర్డు నిర్ణయాలపై జోక్యం చేసుకోకూడదని నిబంధనలు ఉన్నాయి. అవే నిబంధనలు క్రికెట్ బోర్డులకు కూడా వర్తిస్తాయి. ఇరు దేశాల మధ్య ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై క్రికెట్ బోర్డులు కల్పించుకోవన్నారు. అలా అయితే భారత్ పై ఎలాంటి ఉగ్ర దాడులు జరగవని, పుల్వామా తరహా హింసాత్మక ఘటనలు పునరావృతం కావని, కాల్పుల విరమణ ఉల్లంఘనలు, అక్రమ చొరబాట్లు చేయబోమని పీసీబీ ఆ దేశ ప్రభుత్వంతో భారత్ కు హామీ ఇప్పించగలదా అంటూ కౌంటర్ అటాక్ చేసారు. ఐసీసీ లో భారత్ కు వ్యతిరేకంగా నడుచుకునే వ్యక్తులకు పీసీబీ ఏజెంట్ లా వ్యవహరించడం ఇప్పటికైనా మానుకోవాలని సదరు అధికారి హితవు పలికారు.