స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం బన్నీ రాజమహేంద్రవరం అడవుల్లో షూటింగ్ జరుపుతున్నాడు. ఈ సందర్భంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేసిన ఓ పనికి బన్నీ ఫుల్ ఖుషీ అయిపోతున్నాడట.
విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ పేరుతో బట్టల వ్యాపారంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే ఈ బ్రాండ్ కు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. అయితే ఈ రౌడీ హీరోకు మెగా హీరోల్లో బన్నీ అంటే ప్రత్యేక అభిమానం. ఆ విషయాన్ని పలు సందర్భాలలో విజయ్ చెప్పుకొచ్చాడు.
గతంలో ఓసారి బన్నీ కోసం సొంత బ్రాండ్ బట్టలను డిజైన్ చేసి ఇచ్చాడు విజయ్. ఇప్పుడు పుష్ప సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో మరోసారి బానికి విజయ్ డిజైన్డ్ బట్టలను పంపించాడు. విజయ్ అభిమానానికి పొంగిపోయిన బన్నీ ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.
”థాంక్యూ బ్రదర్ నా కోసం ఇంత సౌకర్యవంతమైన, స్టైలిష్ బట్టలను పంపించావు. నా పైన చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు బ్రదర్, రౌడీ క్లబ్ టీమ్ కి ధన్యవాదాలు” అని బన్నీ తెలిపాడు. కాగా ప్రస్తుతం బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డట్టుగా తెలుస్తుంది. సినిమా యూనిట్ లో ఓ వ్యక్తికి కరోనా సోకడంతో సినిమా షూటింగ్ ను నిలిపివేసినట్టుగా సమాచారం. ఇక మరోవైపు పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్’ షూటింగ్ లో విజయ దేవరకొండ బిజీగా ఉన్నాడు.