తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైన సినీ నిర్మాత, మాజీ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు. తాజాగా, రెడ్లకు అనుకూలంగా, వెలమలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. రెడ్లకు అన్ని పార్టీలు నాయకత్వం అప్పగించాలని ఆయన పేర్కొన్నారు.
కాకతీయులు రెడ్లను వదులుకొని వెలమలైన పద్మనాయకులకు పెత్తనం ఇచ్చినందునే కాకతీయ సామ్రాజ్యం కుప్పకూలిందని చెప్పారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ కాంగ్రెస్ పార్టీని.. రెడ్డి కాంగ్రెస్ చేశారని ఆరోపించారు. రెడ్లు తప్ప వెలమలు, కాపులు, కమ్మలు అవసరం లేదా అని ప్రశ్నించారు.
జలగం వెంగళరావు, ఎం.సత్యనారాయణరావు వంటి వెలమ సామాజకవర్గానికి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన త్యాగాలు తెలియవా అని ప్రశ్నించారు. 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్న తెలంగాణలో నాయకత్వం వహించడానికి రెడ్డి కులవాదిగా ఉన్న రేవంత్ రెడ్డికి అర్హత లేదని, ఆయనను పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని బండ్ల గణేష్ కోరారు.. ఈ మేరకు ఆయన రాహుల్ గాంధీకి ట్వీట్లు చేశారు.