నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. దుబ్బాకలో విజయ కేతనం ఎగరవేసిన బీజేపీ ఈ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అందుకోసం ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ప్రకటన చేసారు.
ఈ నెలలో నాగార్జున సాగర్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టుగా పేరొన్నారు. కాగా బీజేపీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని ఆయన స్పష్టం చేసారు. ఇటీవల తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. రెండు ఎమ్మెల్సీలతో పాటుగా నాగార్జున ఉప ఎన్నికను కూడా తామే గెలుస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేసారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అన్ని ముఖ్యనేతలందరం ప్రచారంనిర్వహిస్తాము. 25 మంది ఓటర్లకు ఒక ఇన్ ఛార్జిని నియమించాం. మేధావులు టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలి. లేదంటే తెలంగాణ అన్యాయం అయిపోతుంది అని బండి సంజయ పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులను లెక్కచేయకుండా ప్రభుత్వం గుర్రపుబోడు తండాలో గిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 10 శాతం మంది గిరిజనులకు రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆరోపించారు. రిజర్వేషన్ల పట్ల సీఎం కేసీఆర్ కు చిత్త శుద్ధి లేదని అన్నారు. మళ్ళీ గుర్రపుబోడు వెళ్తామని అక్కడ పెరేడ్ నిర్వహిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.