సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన విశ్వరూపం చూపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు రోజులుగా బాలయ్య తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కాగా శనివారం ప్రచారంలో భాగంగా 9వ వార్డు అభ్యర్థి ఇంటికి వెళ్లారు. అక్కడ వారితో మాట్లాడుతున్న సమయంలో ఓ అభిమాని వీడియో తీస్తుండటంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది.
వెంటనే అతని చెంప చెళ్లుమనిపించారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్న సమయంలో వీడియో తీస్తావా అంటూ కోపంతో ఊగిపోయారు. దీంతో పక్కనే ఉన్న పార్టీ శ్రేణులు బాలయ్య ఆగ్రహానికి హడలిపోయారు. అయితే బాలయ్య అభిమానులపై చేయి చేసుకోవడం కొత్తేమీ కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో బాలయ్య అభిమానులను కొట్టారు.
కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలయ్య హాట్ కామెంట్స్ చేశారు. తనను విమర్శించేవారిపై ఆయన నిప్పులు చెరిగారు. తాను చేసేది ప్రజా సేవని, తన జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తనకన్నా బూతులు ఎవరూ తిట్టలేరని మంత్రులు ఆ విషయం గుర్తుంచుకోవాలన్నారు.