అర్మేనియా, అజర్ బైజాన్ మధ్య యుద్ధంగా ఎక్కడకు దారి తీస్తుంది ? మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందా ? ఆ రెండు దేశాల మధ్య యుద్ధంలోకి మిగతా దేశాలు ప్రవేశిస్తే పరిస్థితేంటి ? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. రెండు చిన్న దేశాల మధ్య ఒక చిన్న భూభాగం కోసం ప్రారంభమైన యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధరంగంలోకి మిగతా దేశాలు కూడా ప్రవేశిస్తుండటమే ఇందుకు కారణం.
ఒకవైపు ప్రపంచమంతా కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తుంటే అజర్ బైజాన్, అర్మేనియా అనే రెండు దేశాలు మాత్రం పరస్పరం యుద్ధం చేసుకుంటున్నాయి. ఇరాన్, టర్కి సరిహద్దుల్లో అజర్ బైజాన్, అర్మేనియా దేశాలు ఉంటాయి. రెండు సరిహద్దులు కలిసి ఉన్న చిన్న దేశాలు. అజర్బైజాన్ ముస్లిం దేశం కాగా, అర్మేనియా క్రిష్టియన్ దేశం. నగర్నో – కరాబక్ష్ అనే చిన్న ప్రాంతం కోసం చాలా ఏళ్లుగా ఈ రెండు దేశాల మధ్య గొడవ నడుస్తోంది. ఈ ప్రాంతం వాస్తవంగా తమ భూభాగమని, 1992 యుద్ధం తర్వాత ఈ భూభాగాన్ని అర్మేనియా ఆక్రమించిందనేది అజర్బైజాన్ వాదన.
ఇంతకుముందు 1980 నుంచి 1992 వరకు ఒకసారి, 2016లో మరోసారి ఈ రెండు దేశాల మధ్య ఈ ప్రాంతం కోసమే యుద్ధాలు జరిగాయి. ఇరువైపులా సుమారు 30 వేల మంది మరణించారని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు మరోసారి యుద్ధం ప్రారంభమైంది. ఇరు దేశాలకు చెందిన 100 మంది ఇప్పటివరకుమరణించారు. రెండు వైపులా సైనిక బలగాలు మొహరించాయి. యుద్ధవిమానాలు బాంబులను కురిపిస్తున్నాయి. రెండు దేశాల్లోని ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ మొదలైంది. నిజానికి ఈ యుద్ధం ఈ రెండు దేశాల వరకు పరిమితం అయితే నష్టం కూడా ఆ రెండు దేశాలకే ఉండేది.
కానీ, ఈ రెండు దేశాల యుద్ధంగా రష్యా, టర్కీ, పాకిస్తాన్, ఫ్రాన్స్, ఇరాన్, ఇజ్రాయిల్ వంటి దేశాల భాగమయ్యే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అజర్ బైజాన్ ముస్లిం మెజారిటీ కలిగిన దేశం. తమ తోటి ముస్లిం దేశానికి మద్దతుగా పక్కనే ఉన్న టర్కీ నిలుస్తుంది. అజర్‌బైజాన్‌కు టర్కీ మద్దతు ఇస్తోంది. ఇప్పటికే టర్కీ బలగాలు అజర్‌బైజాన్‌కు మద్దతుగా అర్మేనియాపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. అజర్‌బైజాన్‌కు మరో ముస్లిం దేశం పాకిస్తాన్ కూడా మద్దతు ఇస్తోంది.
టర్కీ, పాకిస్తాన్ మిత్ర దేశాలు. కశ్మీర్ విషయంలో ఇందులో టర్కీ భారత్‌ను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతోంది. ఇప్పుడు టర్కీ, అజర్‌బైజాన్‌కు మద్దతుగా పాకిస్తాన్ నిలుస్తోంది. ఇప్పటికే ఆ దేశ సైనిక బలగాలను అజర్‌బైజాన్‌కు మద్దతుగా పంపించారనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు అర్మేనియాకు రష్యా మద్దతు ఉంది. ఒకవేళ కనుక అర్మేనియాపై టర్కీ దాడి చేస్తే టర్కీపై దాడి చేసేందుకు రష్యా సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
ఇరాక్, ఇజ్రాయిల్ కూడా చెరో దేశానికి మద్దతుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఈ రెండు చిన్న దేశాల మధ్య యుద్ధరంగంలోకి పెద్ద దేశాలు ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం రావొచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ రెండు దేశాల మధ్య యుద్ధంలో భారత్ పాత్ర తటస్థంగా ఉండవచ్చు. ఎందుకంటే రెండు దేశాలూ మనకు మిత్రులుగా ఉంటున్నాయి.
అర్మేనియా అన్ని విషయాల్లోనూ భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. అజర్బైజాన్తోనూ మనకు ఎటువంటి విభేదాలు లేవు. పైగా ఇరాన్ నుంచి చమురు పైప్లైన్లు భారత్‌లోకి అజర్బైజాన్ మీది నుంచి రావాలి. కాబట్టి, భారత్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధంలో ఒకరి వైపు నిలిచే అవకాశాలు లేవు. అమెరికా, భారత్ వంటి తటస్థ వైఖరి ఉన్న దేశాలు అజర్బైజాన్, అర్మేనియా మధ్య యుద్ధం ఆపి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించే అవకాశాలే ఉన్నాయి. ఈ సయోధ్య కుదిరేందుకు ఎంత ఆలస్యం అయితే అంత నష్టం జరిగే ప్రమాదం ఉంది.