logo

  BREAKING NEWS

జ‌గ‌న్ – ష‌ర్మిల మ‌ధ్య విభేదాలు 100 % నిజం.. ఇదే సాక్ష్యం  |   శ‌త్రువులు కూడా ఈ విష‌యంలో జ‌గ‌న్‌ను శ‌భాష్ అంటారు  |   కరోనాను అడ్డుకునే అస్త్రం అదొక్కటే.. శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు  |   శుభవార్త: తగ్గిన బంగారం ధరలు 16.04.2021 బంగారం, వెండి ధరలు  |   కరోనా తీవ్ర ఇన్ఫెక్షన్ వీరిలోనే ఎక్కువ.. కారణం ఇదే  |   పెరిగిన బంగారం ధరలు 15.04.2021 బంగారం, వెండి ధరలు  |   బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |  

అయోధ్య భూమి పూజకు తొలి ఆహ్వానం అందుకున్న ముస్లిం.. ఎందుకో తెలుసా?

అయోధ్య రామ మందిర నిర్మాణం హిందువుల చిరకాల స్వప్నం. మరి కొద్ది రోజుల్లో ఈ కల నెరవేరబోతోంది. ఆగస్టు 5వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యా నగరం చరిత్రాత్మక ఘట్టానికి సాక్షి కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా శ్రీరాముడి మందిర నిర్మాణానికి భూమి పూజ అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ భూమి పూజ వేడుక కోసం అయోధ్య వాసులతో సహా కోట్లాది మంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రతువుకు సరిగ్గా రెండు రోజుల ముందు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ ఆహ్వాన పత్రికను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందించింది. కోవిడ్ వ్యాప్తి కారణంగా కేవలం 200 మంది ముఖ్య అతిథులను మాత్రమే ఇందుకు ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రామ మందిరం భూమి పూజకు సంబంధించి తొలి ఆహ్వాన పత్రికను ఒక ముస్లింకు అందజేయడం సర్వత్రా చర్చకు దారి తీసింది. ఆయన పేరు ఇక్బాల్ అన్సారీ. అయోధ్యలో బాబ్రీ మసీదు కోసం పోరాటం చేసిన వారిలో ఇక్బాల్ అన్సారీ ప్రముఖుడు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఎంతో మంది పోరాటం చేశారు. అయినా అన్సారీకి తొలి ఆహ్వానం అందడానికి కారణం ఉంది.

దశాబ్దాల వివాదానికి ముగింపు పలుకుతూ గతేడాది సుప్రీం కోర్టు అయోధ్య భూవివాదం కేసులో తీరునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై ఏడు దశాబ్దాల క్రితం కోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది హషీమ్ అన్సారీ. 1952లో హిందూ పక్షాలు బాబ్రీ మసీదును అక్రమంగా ఆక్రమించాయని ఫైజాబాద్ సివిల్ కోర్టులో మ‌రో ఐదుగురు ముస్లింల‌తో క‌లిసి ఆయ‌న దావా వేశారు. అతని కుమారుడే ఇక్బాల్ అన్సారీ. 2016 లో తండ్రి మరణానంతరం ఇక్బాల్ బాబ్రీ మసీదు పోరాటాన్ని చేపట్టారు. అయితే అప్పటికే ఈ వివాదం మత, రాజకీయ రంగు పులుముకుంది. ఎంతో మంది ఈ కేసును సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనుకున్నారు. అయితే ఇక్బాల్ మాత్రం అందుకు భిన్నమైన వైఖరిని కనబరిచారు.

తన తండ్రి లాగే ఈ వివాదాన్ని రాజ్యాంగం మాత్రమే పరిష్కరించాలని సంకల్పించారు. మందిర్ – మసీదు కేసు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై పూర్తి విశ్వాసముంచారు. అదే సమయంలో బాబ్రీ మసీదు కోసం చివరి క్షణం వరకు పోరాడారు. గతేడాది రామ మందిర నిర్మాణంపై సుప్రీం తీర్పును అన్సారీ స్వాగతించారు. అనంతరం సుప్రీం తీర్పును పునః సమీక్షించాలని అఖిల భారత ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు తీసుకున నిర్ణయానికి కూడా అన్సారీ దూరంగా ఉన్నారు. తనకు ఫలితం ముందుగానే తెలుసునని, ఈ సమయంలో సమీక్ష కోసం వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోగా అది అయోధ్య వాసుల మత సామరస్య వాతావరణాన్ని చెడగొడుతుందని అన్సారీ భావించారు.

దశాబ్దాల పాటు సాగిన ఈ కేసులో శాంతి పూరిత వాతావరణాన్ని నెలకొల్పేందుకే అన్సారీ మొగ్గు చూపారు. అందుకే అయోధ్య మందిర నిర్మాణానికి తొలి ఆహ్వాన పత్రికను అన్సారీ అందుకున్నారు. దశాబ్దాలుగా గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మైన ఈ వివాదాన్ని అంతం చేస్తూ ఈ క్రతువుకు హాజరు కావాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఈ మొత్తం వ్యవహారంలో కీలక పరిణామం. తనను ఆహ్వానించడం పట్ల అన్సారీ హర్షం వ్యక్తం చేశారు. ‘నాకు తొలి ఆహ్వానం అందాలన్నది సాక్షాత్తూ శ్రీరాముడి ఆకాంక్ష అని భావిస్తున్నాను. అందుకే దీన్ని మనస్పూర్తిగా స్వీకరిస్తున్నాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్యలో హిందువులు, ముస్లింలు సామరస్యంగా జీవిస్తున్నారు. ఇక్కడ అన్ని మతాలకు సంబంధిం‌చిన దేవుళ్లు ఉన్నారు.

ఇది సాధువుల భూమి. అయోధ్యపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్ని వివాదాలు జరిగినా ఇక్కడివారమంతా సోదర భావంతోనే మెలిగాము. రామ మందిర నిర్మాణం కూడా మాకు సంతోషమే. రాముడికి సంబంధించి అయోధ్యలో నిర్వహించే ఎలాంటి మతపర కార్యక్రమానికైనా నేను సంతోషంగా వెళ్తానని తెలిపారు. మందిర నిర్మాణంతో అయోధ్య పూర్తిగా మారిపోతుందని, నగరం, చుట్టుపక్కల ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని, రాముడి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్సారీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News