ఒలంపిక్స్ చరిత్రలోనే అథ్లెటిక్స్‌లో భారతదేశానికి వందేళ్ల తర్వాత మొదటి స్వర్ణ పతకం తెచ్చి పెట్టారు నీరజ్ చోప్రా. హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా ఇండియన్ ఆర్మీలో ఫోర్త్ రాజ్‌పుతానా రైఫిల్స్ బృందంలో ఆనయిబ్ సుబేదార్‌గా పని చేస్తున్నారు. 2016లో ఆయన ఆర్మీలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన చూపిస్తున్న ప్రతిభను గుర్తించిన ఆర్మీ నీరజ్ చోప్రాను మొదట జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా నియమించింది.
నీరజ్ చోప్రాది వ్యవసాయ కుటుంబం. ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడంతో ప్రస్తుతం దేశంలోని ప్రతీ పౌరుడూ నిరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దేశమంతా సంబరాల్లో మునిగింది. ఇప్పుడు నీరజ్ చోప్రా దేశంలోనే రియల్ హీరోగా మారాడు. కేవలం ప్రశంసలు మాత్రమే కాదు నీరజ్‌పై కాసుల వర్షం కూడా కురుస్తోంది. నీరజ్ స్వర్ణ పతాకం సాధించిన వెంటనే ఆయనకు నగదు బహుమానాలు వస్తున్నాయి.
నీరజ్ స్వంత రాష్ట్రమైన హరియానా ప్రభుత్వం ఆయనకు ఏకంగా రూ.6 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. అంతేకాదు, నీరజ్ మొదట ప్రాక్టీస్ చేసిన పంచకుల నగరంలో హరియాణా ప్రభుత్వం ఏర్పాటుచేయబోతున్న అథ్లెట్ల శిక్షణా కేంద్రానికి హెడ్‌గా నీరజ్ చోప్రాను నియమించనున్నట్లు హరియాణా ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఇది క్లాస్ – 1 జాబ్. దీంతో పాటు ఒక ప్లాట్ కూడా ఆయనకు ఇవ్వనున్నట్లు హరియాణా సీఎం చెప్పారు.
వారి పక్క రాష్ట్రం పంజాబ్ కూడా నీరజ్ చోప్రోకు రూ. 2 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన నీరజ్‌కు క్రికెటర్ల ప్రశంసలతో పాటు బీసీసీఐ నుంచి కోటి రూపాయల బహుమానం అందనుంది.
ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా నీరజ్ చోప్రాకు కోటి నగదు బహుమతిని ప్రకటించింది. హరియాణాకు చెందిన ఎలాన్ గ్రూప్ అనే సంస్థ రూ.25 లక్షలు ఇస్తోంది. ఇండిగో విమానయాన సంస్థ ఏడాది పాటు నీరజ్‌కు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇవన్నీ కేవలం నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన వెంటనే ప్రకటించిన బహుమతులు. ఇంకా అనేక సంస్థలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవార్డులు ప్రకటించే అవకాశం ఉంది. అన్ని బహుమానాలకు, ప్రశంసలకు నీరజ్ నిజమైన అర్హుడు అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు.