logo

  BREAKING NEWS

మూవీ రివ్యూ: రానా ‘అరణ్య’ ఎలా ఉందంటే..?

పాత్ర నచ్చితే ఆ సినిమా కోసం ప్రాణం పెట్టె అతి కొద్ది మంది నటుల్లో దగ్గుబాటి రానా ఒకరు. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన అరణ్య కోసం రానా అదే స్థాయిలో కష్టపడ్డాడు. సినిమా టీజర్, ట్రైలర్ నుంచే అరణ్యకు మంచి బజ్ ఏర్పడింది. ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా రానా కష్టానికి తగిన ఫలితం ఇచ్చిందో లేదో రివ్యూలో తెలుసుకుందాం..

కథ:

నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య (రానా) ప్రకృతి ప్రేమికుడు. అడవులు, వన్య మృగాలను ఎంతగానో ప్రేమిస్తాడు. తన పూర్వికులు 500 ఎకరాల ప్రభుత్వానికి రాసిస్తే ఆ అడవులకు, అక్కడి గిరిజనులను, వన్య ప్రాణులకు సంరక్షకుడిగా వారితోపాటే ఉంటాడు. ఆ అడవిలో లక్షకు పైగా మొక్కలు నాటి రాష్ట్రపతి చేతుల మీదగా ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అవార్డు అందుకుంటాడు. అందుకే అతనిని అరణ్యగా అక్కడి ప్రజలు పిలుస్తుంటారు. అడవిని అక్కడి ఏనుగులను కాపాడే బాధ్యత తీసుకుంటాడు. ఇదిలా ఉంటె ఆ అడవిపై కేంద్ర అటవీ శాఖా మంత్రి కనకమేడల రాజగోపాలం (అనంత్ మహదేవన్) కన్నుపడుతుంది. అడవిని నాశనం చేసి అక్కడ బి టౌన్ షిప్ నిర్మించాలని అనుకుంటాడు. ఆ మంత్రిని అరణ్య ఎలా అడ్డుకున్నాడు? అడవిని అతని భారీ నుంచి ఎలా కాపాడుకున్నాడు? అనేదే సినిమా కథాంశం.

విశ్లేషణ:

గతంలో తెలుగులో వచ్చిన ప్రేమ ఖైదీ, గజరాజు లాంటి డబ్బింగ్ సినిమాల ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు పరిచయమయ్యాడు దర్శకుడు ప్రభు సాల్మన్. ఆయన తన సినిమాల ద్వారా మంచి మెసేజ్ ను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు అరణ్య విషయంలో కూడా అదే చేశారు. కొన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా అరణ్య సినిమాను తెరకెక్కించారు ప్రభు సాల్మన్. ప్రకృతికి మనుషులు చేస్తున్న హాని గురించి తెలిపే ఒక పవర్ ఫుల్ కథ ఇది. కానీ కథనంలో బలం లేకపోవడంతో సినిమా సాగదీతగా అనిపిస్తుంది. పాత్రల పరిచయం వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత కథను సరిగా నడిపించలేకపోయారు. కొన్ని పాత్రలు కథకు ఎందుకు అవసరమో తెలియక ప్రేక్షకుడు తికమక పడే పరిస్థితి. అలాగే ఏనుగులు హీరోకి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంత కనెక్టింగ్ గా అనిపించవు. మహిళా మావోయిస్టుతో మావటి సింఘా ప్రేమ కథ కూడా అంత ఆసక్తిగా ఉండదు. అరణ్య పాత్రను ఇంకా స్ట్రాంగ్గా చూపించి ఉండవచ్చు. సినిమా లో ఎలాంటి ట్విస్టులు లేకుండా సాగిపోతుంది అనే ఫీలింగ్ ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఇక సినిమాలో చూడదగ్గవి రానా పవర్ ఫుల్ నటన. సినిమా అంతా సింగిల్ హ్యాన్డ్ తో నడిపించాడు. నటన పరంగా రానా అరణ్య పాత్రలో అదరగొట్టేసాడు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ప్రేక్షకులకు ఓ టైం లో థియేటర్లలో ఉన్నామా లేదా అనే అనుమానం కలుగుతుంది. అడవి అందాలను చాలా బాగా చూపించారు. పాటలు సోసోగా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సినిమాలో నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

అరణ్య సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే.. రానా నటన, కథ, విజువల్స్, నేపథ్య సంగీతం లాంటివి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్:

సినిమాలో తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ముందుగానే ఊహించగలగడం, సాగదీతగా అనిపించే కొన్ని సీన్లు అరణ్యకు మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

రేటింగ్:
ఫైనల్ అరణ్యకు 2.5 రేటింగ్ ఇవ్వచ్చు..

 

Related News