అరకులో బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని అనకాపల్లి ఆర్టీవో రవీంద్రనాథ్ వెల్లడించారు. బస్సు బ్రేకులు, కండిషన్ అంతా బాగానే ఉన్నాయన్నారు. డ్రైవర్ బాగా అలసిపోవడం వల్ల నిద్రమత్తులో ఉండటంతో బస్సు వేగాన్ని అదుపు చేయలేకపోయాడన్నారు. అదే సమయంలో మూలమలుపు రావడంతో ప్రమాదం సంభవించిందన్నారు.
ప్రమాదానికి గురైన సమయంలో బస్సు వేగం 50 నుంచి 60 కిలో మీటర్లు ఉందన్నారు. అరకు ఘాట్ రోడ్డు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పర్యాటకుల బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన 22 మందిని విశాఖ కెజిహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరో ఇద్దరి బాధితుల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన హైదరాబాద్ కు చెందిన దినేష్ ట్రావెల్స్ పై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో నగరానికి చెందిన షాద్ నగర్ కు చెందిన కుటుంబం కూడా ఉండటం ఉండటంతో నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.