ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేసారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డిని ఈ నెల 21 వరకు ఇంటికే పరిమితం చేయాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ చేసారు. అప్పటివరకు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడనివ్వవద్దని ఆదేశించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎస్ఈసీ వెల్లడించారు.
కాగా నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన పెద్ది రెడ్డి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాటలు విని అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలా చేసినవారిని తమ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. కాగా ఏకగ్రీవాలపై ధ్రువపత్రాలు జారీ చేయకుండా అడ్డుకోవడంపై మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.
జిల్లా అధికారులను ఎస్ఈసీ భయపెడుతున్నారన్నారు. ఆయన తన పరిధి ధాటి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాము ఏమీ అనకుండానే మంత్రి బొత్స సత్యనారాయణపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారన్నారు. పదవీ విరమణ తర్వాత చంద్రబాబు నిమ్మగడ్డను పట్టించుకోరని ఎద్దేవా చేసారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఏ[పీలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి.