ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్ లకు మీడియాతో మాట్లాడొద్దంటూ నోటీసులు జారీ చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు జారీ చేసారు.
తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో కొడాలి నాని ఎస్ఈసీని ఆదేశించి చేసిన వ్యాఖ్యలు తనను, ఎన్నికల సంఘం ప్రతిష్టను కించపరిచేవిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తనపై మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై సాయంత్రం 5 గంటలలోపు మంత్రి వివరణ ఇచ్చుకోవాలని డెడ్ లైన్ విధించారు. వ్యక్తిగతంగా గాని, సహాయకుల చేతగాని తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడంతూ పాటుగా బహిరంగ ప్రకటన కూడా చేయాలన్నారు.
కాగా శుక్రవారం ఉదయం రేషన్ సరకుల పంపిణీ విషయంపై మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడారు. ఈ సందర్భగా చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరిపై ఆయన విరుచుకుపడ్డారు. రేషన్ సరకుల డోర్ డెలివరీకి అడ్డుకోవడానికి ఎస్ఈసీ, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కోడాలి నాని ఆరోపించారు.
వారిద్దరూ కలిసి వచ్చినా పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ గెలుపును ఆపలేరన్నారు. ఎస్ఈసీని, చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరిందని వారిద్దరిని పిచ్చాసుపత్రిలో చేర్పించాలని కొడాలి నాని సెటైర్లు వేశారు. కాగా ఇప్పుడు ఎస్ఈసీ నోటీసులపై కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారనే విషయం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.