ఏపీ పంచాయతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు కొడాలి నాని వర్సెస్ ఎస్ఈసీ అనే విధంగా మారాయి. మంత్రి కొడాలి నాని తనపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటీసులపై కొడాలి నాని స్పందిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి పశ్చాత్తాపం చెందలేదన్నారు.
ఈ వ్యాఖ్యలను ఎస్ఈసీ నిమ్మగడ్డ సీరియస్ గా పరిగణించారు. దీంతో మంత్రి కొడాలి నానిపై చర్యలకు సిద్ధమయ్యారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమే కాకుండా ఎస్ఈసీని బెదిరించారంటూ మంత్రి కొడాలి నానిపై క్రిమినల్ కేసు పెట్టాలంటూ కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు. అయితే మంత్రిపై ఎస్పీ చర్యలు తీసుకుంటారా రాలేదా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అంతకుముందు కొడాలినానిని ఈ నెల 21 వరకు మీడియా సమావేశాల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించారు నిమ్మగడ్డ. ఎన్నికల సమయంలో మంత్రి తనపై చేసిన వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమైనవని పేర్కొన్నారు. కొంతకాలంగా ఉద్దేశ్యపూర్వకంగానే మంత్రి ఎస్ఈసీని విమర్శిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పతనాన్ని కోరుకుంటున్నారని ఎస్ఈసీపై నాని చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. రాష్ట్రాధినేతగా సీఎం జగన్ అంటే తనకెంతో గౌరవముందని నిమ్మగడ్డ నోటీసుల్లో పేర్కొన్నారు.