ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్దత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ సీఎస్ నీలం సాహ్నికి రాసిన లేఖ మరోసారి చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలని నిర్వహించాలని అందుకు ప్రభుత్వం సహకరించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
కాగా కరోనా నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం, నిర్వహించాలని ఎన్నికల కమిషన్ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి నిమ్మగడ్డ ప్రభుత్వానికి లేఖ రాసారు. ఫిబ్రవరిలో లోకల్ ఎలక్షన్స్ ను నిర్వహించాలని కోరారు. అందుకు ప్రభుత్వం సహాయ సహకారాలను అందించాలన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని… కరోనా కేసులు ఉన్నా దేశంలోని ఇతర రాష్ట్రాలు ఎన్నికలు నిర్వహిస్తున్నారని నిమ్మగడ్డ పేర్కొన్నారు.
ఏపీ సీఎస్ తో పాటుగా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ముఖ్యకార్యదర్శి, కమిషనర్ కు కూడా నిమ్మగడ్డ లేఖ రాశారు. అందులో కోర్టు ఉత్తర్వులను ప్రస్తావించారు. 2021 జనవరి నాటికి ఓటర్ల సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఇదే విషయమై అక్టోబర్ 23 న కూడా నిమ్మగడ్డ సీఎస్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. మరి ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం, సీఎస్ నీలం సాహ్ని ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.