ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21 వరకు ఇంటికే పరిమితం కావాలంటూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలను సవాలు చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది.
మంత్రిపై ఎస్ఈసీ ఆదేశాలను కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన కోర్టు.. పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడానికి ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలు చెల్లవని పేర్కొంది. అయితే మంత్రి ప్రెస్ మీట్ లకు మాత్రం అనుమతులు లేవని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చుక్కెదురైంది.
కాగా శనివారం రోజున ఎస్ఈసీ మంత్రి పెద్ది రెడ్డిపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో ఎన్నికలపై పెద్దిరెడ్డి మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని కూడా ఎస్ఈసీ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఆంక్షలను అమలు చేయాలనీ ఆయన డీజీపీని ఆదేశించారు.