logo

హైకోర్టు తీర్పుపై జ‌గ‌న్ స‌ర్కార్ నెక్ట్స్ స్టెప్ ఇదే..?

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్‌ను తిరిగి నియ‌మించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వం సీనియ‌ర్ న్యాయ‌వాదుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. తీర్పు కాపీలు అంద‌గానే సుప్రీం కోర్టుకు వెళ్లాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. హైకోర్టులో తీర్పు ప్ర‌తికూలంగా వ‌స్తుంద‌ని ముందే ప్ర‌భుత్వ పెద్ద‌లు ఊహించిన‌ట్లు చెబుతున్నారు.

కాగా, చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నియ‌మితులైన నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ స్థానంలో జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్‌ను నియ‌మించింది. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప‌ద‌వీకాలాన్ని త‌గ్గించ‌డంతో పాటు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా విశ్రాంత జ‌డ్జిల‌నే నియ‌మించాల‌నే కొత్త నిబంధ‌న‌ల‌తో ఏపీ ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్ర‌కారం నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ ప‌ద‌వ‌వీకాలం పూర్త‌య్యింది. దీంతో ఆయ‌న స్థానంలో ఏపీ ప్ర‌భుత్వం త‌మిళ‌నాడుకు చెందిన జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్‌ను నియ‌మించ‌గా ఆయ‌న బాధ్య‌త‌లు కూడా తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

త‌న‌ను ఈ ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డాన్ని స‌వాల్ చేస్తూ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ హైకోర్టుకు వెళ్లారు. ఆయ‌న‌తో పాటు మ‌రో 12 పిటీష‌న్లు కూడా న‌మోద‌య్యాయి. ఈ పిటీష‌న్ల‌ను విచారించిన కోర్టు ఏపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ‌చిన ఆర్డినెన్స్‌ను, జీవెల‌ను కొట్టివేసింది. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా క‌న‌గ‌రాజ్ నియామ‌కం చెల్ల‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్పుడు హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి.

Related News