తెలంగాణకు బస్సులు నడిపేందుకు ఇంకా ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వలేదని అనుమతులు వచ్చిన వెంటనే బస్సు సర్వీసులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఛైర్మెన్ కృష్ణ బాబు తెలిపారు. ఏపీ రాష్ట్రంలోని సరిహద్దుల్లో చెక్ పోస్టులను తొలగిస్తున్నారని, రాష్ట్రంలోకి ఎవరైనా రావచ్చని రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను కృష్ణ బాబు ఖండించారు.
ప్రభుత్వం అలాంటి నిర్ణయమేది తీసుకోలేదన్నారు. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆంక్షలే ఇక ముందు కూడా ఉంటాయన్నారు. రాష్ట్రంలోకి అందరిని అనుమతించమని పాసులు ఉన్న వారే రావాలన్నారు. అవాస్తవాలను నమ్మవద్దని కోరారు. కోవిడ్ ఆర్డర్ 55 ప్రకారం చెక్ పోస్టులను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో మరి కొంత కాలం సరిహద్దులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు నియంత్రిస్తామన్నారు.
ఇక ఎవరైనా రాష్ట్రంలోకి రావాలనుకుంటే వారు కచ్చితంగా స్పందన యాప్ లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. రాష్ట్రంలోకి వచ్చేవారందరికి కరోనా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న 6 రాష్ట్రాల నుండి వచ్చిన వారు వారం రోజుల పాటు సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉండాల్సిందేనని తెలిపారు.