ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పింది. హై కోర్టులో ఎంపీటీసీ, జడ్పీటిసి ఎన్నికల రీ నోటోఫికేషన్ పై శుక్రవారం నాడు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రీ నోటిఫికేషన్ విషయమై ఇపటివరకు ఎస్ఈసీ కౌంటర్ దాఖలు చేయకపోవడం పై ప్రశ్నించింది.
సోమవారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని లేని పక్షంలో కౌంటర్ లేనట్లుగానే భావిస్తామని కోర్టు తెలిపింది. కాగా ఎంపీటీసీ, జడ్పిటీసి ఎన్నికలపై ఎన్నికల సంఘం రీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ హై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది.
అందుకోసం తమకు కొంత గడువు కావాలని ఈసీ కోరింది. తాజాగా విచారణ సమయంలో ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేయలేదన్న విషయాన్ని హై కోర్టు గుర్తించింది. కౌంటర్ దాఖలు చేయనందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టును క్షమాపణలు కోరాగా.. ఈ విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.