ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎవరు, ఎంతగానైనా విభేదించవచ్చు. ఆయన పనితీరును ఎండగట్టవచ్చు. ప్రభుత్వ పాలనను తప్పుపట్టవచ్చు. కానీ, ఒక్క విషయంలో మాత్రం జగన్‌ను ప్రశంసించకుండా ఉండలేరు. రాజకీయంగా విభేదించే వారు కూడా ఈ విషయంలో జగన్ పనితీరును, శ్రద్ధను మెచ్చుకుంటున్నారు. పిల్లల చదువుల పట్ల జగన్ చూపిస్తున్న చొరవను సమాజంలో అన్ని రంగాల వారు ప్రశంసిస్తున్నారు. తాజాగా విద్యారంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని జగన్ తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయనే ప్రశంసలు వస్తున్నాయి.
ఫిబ్రవరి 24న విద్యాశాఖతో జగన్ సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్ – తెలుగు డిక్షనరీ ఇవ్వాలని జగన్ సూచించారు. చూడటానికి చిన్న నిర్ణయంగానే ఇది కనిపిస్తోంది. కానీ, విద్యారంగం పట్ల జగన్‌కి ఉన్న చిత్తశుద్ధిని ఇది నిరూపిస్తోంది. తెలుగు మాతృభాషగా ఉన్న చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ముందు డీక్షనరీ కొంటారు. డీక్షనరీ విద్యార్థులకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.
పిల్లలకు ఏది మంచి పుస్తకమో గుర్తించి, కొనివ్వడానికి తండ్రులకే సమయం దొరకదు. అటువంటిది పిల్లలకు డీక్షనరీ చాలా ఉపయోగపడుతుందని గుర్తించి రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఉచితంగా ఇవ్వాలని జగన్ నిర్ణయించడం చాలా బాగుంది. ఇంగ్లీష్ మీడియం విద్యపై పట్టుదలగా ఉన్న జగన్ ఇందుకు తగ్గట్లుగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, ఒక పేజీలో ఇంగ్లీష్‌లో పాఠ్యాంశాలను తయారు చేయించారు. తద్వారా పిల్లలు ఇంగ్లీష్‌ను సులువుగా నేర్చుకోగలరు.
ఇక, 2021 – 22 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల్లో సీబీఎస్ఈ విధానాన్ని అమలులోకి తేవాలని జగన్ నిర్ణయించారు. ముందుగా 1 నుంచి 7వ తరగతి వరకు ఈ విధానాన్ని అమలు చేయాలని ఆ తర్వాత ఒక్కో తరగతిని పెంచుకుంటూ పోవాలని జగన్ సూచించారు. పాఠశాల్లో సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ చాలా రోజులుగా మేధావులు వినిపిస్తున్నారు. ఇప్పుడు దీనిని ఆచరణలోకి తెచ్చేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు.
సీబీఎస్ఈ సిలబస్ పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తల్లిదండ్రులకు సైతం తమ పిల్లలను సీబీఎస్ఈ సిలబస్‌లో చేర్పించాలనే ఆశలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లోనే సీబీఎస్ఈ సిలబస్ పెడితే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాగా, ఇప్పటికే విద్యారంగంలో నాడు – నేడు, అమ్మ ఒడి, విద్యా కానుక వంటి పథకాలు తెచ్చిన జగన్ సంస్కరణలకు బాటలు వేశారు. వీటిపై విమర్శలను పక్కనపెడితే పేద పిల్లలకు ఇవి చాలానే మేలు చేస్తాయి. ఎందుకంటే, పేదరికాన్ని, సామాజిక అసమానతలను రూపుమాపే శక్తి కేవలం చదువుకే ఉంది. చదువు మాత్రమే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.