కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఆయన స్పందన కార్యక్రమంపై సమీక్షలో భాగంగా కలెక్టర్లతో కరోనాపై మాట్లాడి పలు సూచనలు చేశారు. కరోనా పట్ల ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్–19 పరీక్షలు తప్పనిసరిగా జరగాలని చెప్పారు. పిహెచ్‌సిలు, యుహెచ్‌పిలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రలు, జిజిహెచ్‌లలో పరీక్షల నిర్వహణ తప్పనిసరి అని స్పష్టం చేశారు.
కోవిడ్ పరీక్షల కోసం ఎక్కడికి వెళ్లాలో అర్ధం కాని పరిస్థితి రాష్ట్రంలో ఎవరికీ రాకూడదన్నారు. కోవిడ్ పరీక్షలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, ఆసుపత్రుల్లో అడ్మిషన్లు తదితర అన్ని అవసరాలకు 104 కాల్ సెంటర్‌ను ఉపయోగించుకోవాలని, ఈ నంబర్‌ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కాల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లకు రిక్వెస్ట్‌లు వస్తే వెంటనే దానిపై స్పందించాలని ఆదేశించారు. ఆ ఫోన్ కాల్స్‌పై ఎలా స్పందిస్తున్నామనేదే మన పనితీరుకు అద్దం పడుతుందన్నారు.
కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన వ్యక్తి పట్ల మనం ఎలా రెస్పాండ్ అవుతున్నామో జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లా కలెక్టర్లు, జేసీలు ప్రతిరోజూ 104 కాల్ సెంటర్లకు, జిల్లా కోవిడ్ సెంటర్లకు మాక్ కాల్స్ చేసి, వ్యవస్థలో ఎక్కడైనా ఉదాసీనత ఉందా అనేదానిని పరీక్షించాలని సూచించారు. ఆర్టీపీసీఆర్, ట్రూనాట్ పరీక్షల్లో నమూనాలు తీసుకున్న 24 గంటలు, రాపిడ్ పరీక్షలో 30 నిమిషాల్లో ఫలితం అందించే విధంగా జిల్లా కలెక్టర్లు దృష్టిపెట్టాలని పేర్కొన్నారు.
జిల్లాల్లోని అన్ని ల్యాబ్‌లకు అవసరమైన పరికరాలను అందించడం జరిగిందని, ఎక్కడా కిట్ లు లేవనే పేరుతో పరీక్షలు నిరాకరించకూడదని ఆదేశించారు. పాజిటీవ్ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లు ఉన్న వారిని కచ్చితంగా హోం క్వారంటైన్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో అదనంగా 17వేల మంది వైద్యులు, ఇతర సిబ్బందిని ఆరు నెలల కాలానికి కాంట్రాక్ట్ విధానంలో నియమించేందుకు అనుమతి ఇచ్చామని, మరో 11 వేల మంది ట్రైనీ నర్స్‌లను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
దీనికి సంబంధించి ఇంకా కొన్నిచోట్ల నియామకాలు పూర్తి కాలేదని, వాటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మరో వారం రోజుల్లో రెగ్యులర్ పోస్ట్‌ల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. నియమితులైన అభ్యర్ధులు వెంటనే వారికి నిర్ధేశించిన కోవిడ్ విధుల్లో చేరాలన్నారు. దానిని కూడా కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని సూచించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి అవసరమైన మందులతో కూడిన మెడికల్ కిట్లను పంపిణీ చేస్తున్నామని, మెడికల్ ఆఫీసర్ ఫోన్లో 14 రోజుల పాటు పేషంట్‌కు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్లు ఈ హోం కిట్లలో అన్ని మందులు ఉన్నాయో లేదో పర్యవేక్షించాలని ఆదేశించారు.