డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ వినియోగదారులే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే యూజర్లు కొన్ని ప్రమాదకర యాప్ ల జోలికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలు జరిపే మొబైల్ ఫోన్ యూజర్లు ఆయా యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోమంటూ వచ్చే ఎస్ఎంఎస్, కాల్స్‌ను పట్టించుకోవద్దని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని వివరిస్తున్నారు. యాప్‌లను డౌన్లోడ్ చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎనీ డెస్క్ అనే మొబైల్ యాప్ ద్వారా అనేక మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఈ యాప్ ఏ ఫోన్లో ఉంటుందో.. అందులోని యూజర్ల డేటా మొత్తం సైబర్ నేరస్తుల చేతికి వెళ్ళిపోతుంది.
సైబర్ నేరగాళ్లు డబ్బు చెల్లింపుల కోసం పేటిఎం లాంటి యాప్ లను ఉపయోగించేవారిని టార్గెట్ చేసుకుంటారు. కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవాలంటూ మెసేజిలు, కాల్స్ ను చేస్తారు. లేదంటే మీ యాప్ పని చేయదని చెప్తారు. అయితే.. కేవైసీ వివరాలను నేరుగా అప్డేట్ చేసేందుకు సాధ్యపడదని ‘ఎనీ డెస్క్’, ‘క్విక్ సపోర్ట్’, ‘టీం వ్యూయర్’ యాప్‌ల్లో ఏదో ఒకదాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని సూచిస్తారు.
యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక్క రూపాయి లేదా రూ.100 వరకు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. డబ్బులను బదిలీ చేసేందుకు బ్యాంకు అకౌంట్, ఇతర వివరాలను నమోదు చేసే సమయంలోనే బ్యాంకు ఖాతా, పేటీఎం యాప్ తదితర సమాచారమంతా వాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. ఆ సమాచారం సాయంతో మనం పంపించినట్లుగానే డబ్బులను వాళ్లను ఖాతాకు బదిలీ చేసుకుంటారు.
ఆన్లైన్ షాపింగ్ చేస్తారు. ఆ సమయంలో బాధితులు డబ్బులను బదిలీ చేయడానికి ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవుతుంది. కొందరు ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్లను కనెక్ట్ చేసి ఉంచుతారు. వారి అకౌంట్లు హ్యాక్ అయినప్పుడు అన్ని అకౌంట్లలో ఉన్న డబ్బును కేటుగాళ్లు ఊడ్చేస్తారు. వారు అనుకున్న పని అయిపోగానే అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి సమాచారం ఉండదు. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ కావడం లేదా పనిచేయడం ఆగిపోతుంది. అప్పుడు గానీ మోసపోయాని బాధితులు గుర్తిస్తుంటారు.
సైబర్ మోసాల్లో బాధితులు కోల్పోయిన డబ్బు తిరిగి పొందడం చాలా తక్కువ కేసుల్లో మాత్రమే సాధ్యపడుతుంది. చాలా కేసుల్లో పోలీసులు కష్టపడి నేరస్థులను గుర్తించినా డబ్బులను తిరిగిప్పించే విషయంలో బాధితులకు న్యాయం చేయలేకపోతున్నారు. డబ్బుల్లేవు.. ఖర్చు చేశామంటూ నేరస్థులు చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక్కసారి డబ్బులు పోతే.. మళ్లీ రావని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.