విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇందుకు గానూ ఇవాళ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆయనకు అపాయింట్మెంట్ ఖరారైంది. వాసుపల్లి గణేష్ కుమార్తో పాటు ఆయన కుమారుడు కూడా జగన్ను కలవనున్నారు.
వాసుపల్లి గణేష్ కుమారుడికి వైసీపీ కండువా కప్పి జగన్ అధికారికంగా పార్టీలో చేర్చుకోనున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ అనధికారికంగా వైసీసీలో చేరనున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆయన ఇవాళ వైసీపీకి జై కొట్టబోతున్నారు.
ఇప్పటికి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం వైసీపీలో అనధికారికంగా చేరారు. ఇప్పుడు వాసుపల్లి గణేష్ చేరికతో మొత్తం నలుగురు సభ్యులు టీడీపీకి దూరమవుతున్నట్లు లెక్క. దీంతో అసెంబ్లీలో టీడీపీ బలం 19 మందికి పడిపోతుంది. ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళితే టీడీపీ ప్రతిపక్ష హోదా కూడా గల్లంతవుతుంది. విశాఖపట్నం నగరం టీడీపీకి కంచుకోట లాంటిది.
2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ గాలి వీచినా విశాఖపట్నం నగరంలో మాత్రం టీడీపీ హవానే నడిచింది. నగరంలోని మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అయితే, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ పెట్టాలని వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో తమకు పట్టున్న ప్రాంతంలో టీడీపీ క్రమంగా బలహీనపడుతోంది. ఆ పార్టీ నాయకుల్లోనే అంతర్మథనం మొదలైంది. ఈ క్రమంలోనే వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరుతున్నారు. ఆయన చేరిక గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా మారబోతోంది.