ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందారు రోజా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వాయిస్ బలంగా వినిపించేవారు. తెలుగుదేశం పార్టీపై ఆమె దూకుడుగా విమర్శలు చేసే వారు. దీంతో వైసీపీ కీలక నేతల్లో ఒకరిగా రోజా గుర్తింపు పొందారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రోజాకు తప్పనిసరిగా మంచి స్థానం లభిస్తుందని, మంత్రి అవుతారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చినా, జగన్ ముఖ్యమంత్రి అయినా మంత్రి కావాలనే రోజా ఆశలు మాత్రం నెరవేరలేదు. ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. చివరి నిమిషం వరకు రోజా పేరు మంత్రి పదవి రేసులో వినిపించినా ఆమెకు క్యాబినెట్లో చోటు దక్కలేదు. దీంతో రోజా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అయితే, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ పదవిని ఆమెకు ఇచ్చి పార్టీ ఆమెను బుజ్జగించింది. దీంతో ఏడాదిన్నర తర్వాత జరగబోయే క్యాబినెట్ విస్తరణలో తనకు చోటు దక్కుతుందని భావిస్తూ ఆమె సైలెంట్‌గా మారిపోయారు.
ఇప్పటికే మంత్రి పదవి దక్కక నిరాశలో ఉన్న రోజాకు స్వంత నియోజకవర్గం వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చికాకు పెట్టిస్తున్నాయి. నగరి నియోజకవర్గం వైసీపీలో రోజాకు వ్యతిరేకంగా కేజే కుమార్ అనే నాయకుడికి ప్రత్యేక వర్గం ఉంది. ఈ రెండు వర్గాలకు అస్సలు పడదు. దీంతో కేజే కుమార్‌కు చెక్ పెట్టేందుకు రోజా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ, జిల్లా మంత్రి, ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహతులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు కేజే కుమార్‌కు ఉన్నాయి.
దీంతో రోజాకు ధీటుగా నగరి నియోజకవర్గ వైసీపీలో చక్రం తిప్పుతున్నారు కేజే కుమార్. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్ల కూడా రోజా వ్యతిరేకంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో కేజే కుమార్ సతీమణి కేజే శాంతికి కీలకమైన నామినేటెడ్ పదవి ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ ఛైర్పర్సన్ పదవికి కేజే శాంతి పేరు ఖరారైంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సులతోనే కేజే శాంతి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది.
దీంతో కేజే కుమార్ వర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తన వైరి వర్గానికి చెందిన వ్యక్తికి కీలకమైన కార్పొరేషన్ పదవిని ఇస్తుండటం పట్ల రోజా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆమె ఈ పదవిని కేజే శాంతికి దక్కకుండా ఆపుతారా లేదా వదిలేస్తారా అనేది చూడాల్సి ఉంది. మొత్తంగా మంత్రి పదవి దక్కక రాష్ట్రంలో, వర్గవిభేదాలతో నియోజకవర్గంలో రోజాకు నిరాశే మిగులుతోంది.