తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తైన సైకిల్ గుర్తు సమాజ్‌వాదీ పార్టీకి కూడా ఎన్నిక గుర్తే. ఈ విషయం చాలా మందికి తెలుసు. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు కూడా మరో పార్టీకి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఎన్నికల గుర్తు మాత్రమే కాదు జెండా కూడా వైసీపీని పోలి ఉంటుంది ఆ పార్టీకి. అసలు వైసీపీని పోలిన జెండా, గుర్తు ఉన్న పార్టీ ఏంటి ? ఆ పార్టీకి, వైసీపీకి ఏమైనా సంబంధం ఉందా, అసలు ఆ పార్టీ ఎక్కడ ఉంది ?
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత 2011 మార్చ్ 12న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైసీపీ ఏర్పడ్డ తర్వాత సరిగ్గా రెండేళ్లకు 2013 మార్చ్ 3న బిహార్‌లో మరో ప్రాంతీయ పార్టీ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఏర్పడింది. జనతాదళ్(యునైటెడ్) పార్టీకి రాజీనామా చేసిన ఉపేంద్ర కుశ్వాహ అనే నాయకుడు పట్నాలో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీని ప్రారంభించారు. అప్పటికి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండేవారు.
జేడీయూపైన, ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పైన వ్యతిరేకతతోనే ఈ పార్టీని స్థాపించారాయన. అప్పటికే వైసీపీని స్థాపించిన జగన్ నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండాను తన పార్టీకి పెట్టుకున్నారు. ఉపేంద్ర కుశ్వాహ కూడా తన పార్టీకి ఇదే జెండాను పెట్టుకున్నారు. కాకపోతే, వైసీపీ జెండా మధ్యలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన పెట్టిన పథకాల గుర్తులు ఉంటాయి. ఆర్ఎల్ఎస్పీ పార్టీ జెండాలో ఇటువంటి గుర్తులు ఏవీ ఉండవు.
కడప ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కేటాయించాలని కోరిన జగన్ ఆ తర్వాత తమ పార్టీకి ఫ్యాన్ గుర్తును శాశ్వతంగా పెట్టుకున్నారు. ఉపేంద్ర కుశ్వాహ కూడా జగన్‌లానే ఫ్యాన్ గుర్తును కేటాయించాలని ఎన్నికల సంఘానికి వినవించుకున్నారు. వైసీపీ ప్రాంతీయ పార్టీ కావడం, కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైన పార్టీ కావడంతో బిహార్‌కు మాత్రమే పరిమితమైన ఉపేంద్ర కుశ్వాహకు కూడా ఫ్యాన్ గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం. దీంతో వైసీపీ జెండా, ఫ్యాన్ గుర్తు ఆర్ఎల్ఎఎస్పీ పార్టీకి కూడా వచ్చాయి.
అయితే, వైసీపీని స్థాపించిన జగన్ ఆ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చి, పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిపి సక్సెస్ చేశారు. కానీ, ఉపేంద్ర కుశ్వాహ మాత్రం తన పార్టీని విజయతీరాలకు చేర్చలేక చతికిలపడుతున్నారు. 2014లో ఆయన పార్టీ ఎన్డీఏలో చేరి బిహార్‌లో మూడు పార్లమెంటు స్థానాలకు పోటీ చేసి మూడింటిలోనూ విజయం సాధించారు. ఉపేంద్ర కుశ్వాహ కేంద్ర మంత్రి కూడా అయ్యారు. కానీ, తర్వాతి కాలంలో తాను తీవ్రంగా వ్యతిరేకించే నితీష్ కుమార్ ఎన్డీఏలోకి రావడంతో ఉపేంద్ర కుశ్వాహ బయటకు వచ్చేశారు.
2019 పార్లమెంటు ఎన్నికల్లో యూపీఏలో చేరి ఐదు ఎంపీ స్థానాలకు పోటీ చేసింది ఈ పార్టీ. ఐదు స్థానాల్లోనూ ఓడిపోయింది. ఉపేంద్ర కుశ్వాహ స్వయంగా రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడారు. ఇక త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంతో కూడిన ఆరు పార్టీల కూటమిలో ఈ ఆర్ఎల్ఎస్పీ కూడా చేరింది. ప్రస్తుతం ఈ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా లేరు. ఇలా ఒకే జెండా, ఎన్నికల గుర్తు పెట్టుకొని ఇంచుమించు ఒకేసారి ఆవిర్భవించిన వైసీపీ సూపర్ సక్సెస్ అయితే, ఆర్ఎల్ఎస్పీ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది.