తెలంగాణలో అవినీతి అధికారులను ఏసీబీ వెంటాడుతోంది. రూ.1.12 కోట్ల లంచం తీసుకుంటున్న మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం డిమాండ్ చేస్తున్న ఆడియో టేపులతో సహా నగేష్ అడ్డంగా దొరికిపోయాడు. మెదక్‌లోని ఆయన కార్యాలయంతో పాటు మూడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
మెదక్‌లో 113 ఎకరాలకు సంబంధించి భూమికి ఎన్ఓసీ ఇవ్వడానికి రూ.1.50 కోట్ల లంచంతో పాటు రూ.1 కోటి విలువ చేసే స్థలాన్ని తన పేరు మీదకు చేయాల్సిందిగా అడిషనల్ కలెక్టర్ నగేష్ డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి అడ్వాన్సుగా ఇప్పటికే రూ.40 లక్షలు తీసుకున్నాడు. అంతేకాదు, ఈ విషయాన్ని ఏకంగా అగ్రిమెంట్ సైతం చేసుకునన్నారని తెలుస్తోంది. బ్లాంక్ చెక్కులు కూడా తీసుకున్నారు.
ఈ వ్యవహారం ఏసీబీకి తెలియడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు నగేష్ అక్రమాలను తవ్వితీసేందుకు సోదాలు జరుపుతున్నారు. కాగా, భూవివాదంలోనే ఇటీవల కీసర తహశీల్దార్ నాగరాజు ఏకంగా రూ.1.38 కోట్లు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇంకా వార్తల్లో ఉండగానే ఏకంగా అడిషనల్ కలెక్టర్ రూ.2 కోట్లకు పైగా లంచం డీల్ చేసుకొని ఏసీబీకి దొరకడం చర్చనీయాంశమైంది.