logo

అన్న‌మ‌య్య జిల్లా పూర్తి వివ‌రాలు

తెలుగు సాహితీ చ‌రిత్ర‌లో మొద‌టి వాగ్గేయ‌కారుడిగా, తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి అప‌ర‌భ‌క్తుడిగా పేరుగాంచిన తాళ్ల‌పాక అన్న‌మాచార్యుల వారికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మంచి గుర్తింపును ఇచ్చింది. కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా అన్న‌మ‌య్య పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది. రాయ‌చోటి జిల్లా కేంద్రంగా ప్ర‌భుత్వం కొత్త జిల్లాను ఏర్పాటుచేసి ఈ జిల్లాకు అన్న‌మ‌య్య జిల్లాగా పేరు పెట్టింది.

పాత క‌డ‌ప జిల్లా నుంచి అన్న‌మ‌య్య జిల్లా వేరుప‌డింది. ఈ జిల్లాకు రాయ‌చోటి ప‌ట్ట‌ణం కేంద్రంగా ఉంటుంది. అన్న‌మయ్య జిల్లాలో రాజంపేట‌, రైల్వే కోడూరు, రాయ‌చోటి, తంబ‌ళ్ల‌ప‌ల్లె, మ‌ద‌న‌ప‌ల్లె, పీలేరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. రాజంపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్నే అన్న‌మ‌య్య జిల్లాగా ఏర్పాటు చేశారు. అయితే, అన్ని ప్రాంతాల‌కు స‌మీపంలో ఉండాల‌నే ఆలోచ‌న‌తో జిల్లా కేంద్రంగా మాత్రం రాయ‌చోటిని ఖ‌రారు చేశారు.

ఇందులో రాజంపేట‌, రైల్వే కోడూరు, రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గాలు ఇప్ప‌టి వ‌ర‌కు క‌డ‌ప జిల్లాలో ఉండేవి. తంబ‌ళ్ల‌ప‌ల్లె, మ‌ద‌న‌ప‌ల్లె, పీలేరు నియోజ‌క‌వ‌ర్గాలు ఇంత కాలం చిత్తూరు జిల్లాలో ఉండేవి. ఇప్పుడు ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాలు అన్న‌మ‌య్య జిల్లాలోకి వ‌చ్చాయి. అన్న‌మ‌య్య జిల్లాలో మూడు రెవెన్యూ డివిజ‌న్లు ఉన్నాయి. ఇందులొ మ‌ద‌న‌ప‌ల్లె, రాజంపేట పాత డివిజ‌న్లే కాగా కొత్త‌గా రాయ‌చోటిని రెవెన్యూ డివిజ‌న్‌గా ఏర్పాటు చేశారు.

అన్న‌మ‌య్య జిల్లాలో మొత్తం 32 మండ‌లాలు ఉన్నాయి. ఈ జిల్లా విస్తీర్ణంగా 8,459 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లుగా ఉంది. 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం అన్న‌మ‌య్య జిల్లా జ‌నాభా 17.68 ల‌క్ష‌లు. అన్న‌మ‌య్య తాళ్ల‌పాక అనే గ్రామంలో జ‌న్మించారు. ఇది రాజంపేట ప‌ట్ట‌ణం స‌మీపంలో ఉంటుంది. ఈ జిల్లాలో ఆంధ్రా భ‌ద్రాచ‌లంగా పేరుగాంచిన ఒంటిమిట్ట కూడా ఉంటుంది. ఎర్ర‌చందనం కేంద్ర‌మైన శేషాచ‌లం అడ‌వులు కూడా ఈ జిల్లాలోనే ఉంటాయి.

Related News