టీడీపీ మాజీ మంత్రి, శ్రీకాకుళం టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు పై రాజకీయ దుమారం రేగుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాల హయాంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి విచారణకు ఆదేశించగా.. 2020 ఫిబ్రవరి 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐ లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. తెలంగాణ ఈఎస్ఐ లో భారీ కుంభకోణం వెలుగు చూసిన కొద్దీ రోజులకే ఏపీ ఈఎస్ఐ స్కామ్ ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బయటపెట్టారు.
2014-19 మధ్య నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి రూ.38.56 కోట్ల మందులకు రూ.89.58 కోట్ల చెల్లించి కొనుగోలు చేసారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 51. కోట్ల నష్టం జరిగినట్టు అంచనా వేశారు. కేవలం రూ.293.51 కోట్ల మందుల కొనుగోళ్ళకు మాత్రమే అనుమతి ఉండగా .. రూ.698.36 కోట్లు చెలించి మందులు కొనుగోలు చేసారు. అదే సమయంలో నామినేషన్ పద్ధతిపై రూ. 237 కోట్ల విలువైన ల్యాబ్ కిట్లను మార్కెట్ ధర కంటే 36 శాతం అధిక ధర చెల్లించినట్లుగా అధికారులు గుర్తించారు.
ఈ ల్యాబ్ కిట్ల కొనుగోలు ద్వారా ప్రభుత్వానికి రూ. 85. కోట్ల నష్టం వాటిల్లిందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఈఎస్ఐ డైరెక్టర్ రవికుమార్ తో పాటుగా మరో ఇద్దరినీ బాధ్యులుగా గుర్తించారు. ఈ స్కామ్ లో ఓ వైద్యుడిని విచారించగా అతని ద్వారా టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర వెలుగులోకి వచ్చింది. ఈఎస్ఐ లో లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్ తీసుకుని అచ్చెన్నాయుడు ఆర్డర్లు ఇచ్చినట్టుగా విజిలెన్స్ విచారణలో తేలింది.
నామినేషన్ పద్దతిలో టెండర్లు ఇప్పించారని, టెలీ హెల్త్ సర్వీసెస్ పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారని విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది. నామినేషన్ పద్దతిలో టెలీ మెడిసిన్ ల్యాబ్ కు కాంట్రాక్ట్ అందజేయాలని కోరుతూ అచ్చెన్నాయుడు గతంలో ఈఎస్ ఐ డైరెక్టర్ రవికుమార్ కు లేఖ రాసినట్టుగా విజిలెన్స్ పేర్కొంది. DIMS డైరెక్టర్ వాంగ్మూలంతో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. మందులు, పరికరాల కొనుగోలులోమొత్తం రూ. 151 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.