దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది కృష్ణపట్నం ఆయుర్వేద మందు. ఆనందయ్య స్వయంగా తయారుచేసి అందిస్తున్న ఈ మందు కరోనా బారిన పడిన వారు కోలుకునేందుకు బాగా పని చేస్తోందనేది చాలా మంది నమ్ముతున్న మాట. ఈ మందు పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకుముందులా కాకుండా ఒక ప్రణాళిక ప్రకారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మందును పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టులో మందు తయారీ జరుగుతోంది.
ఆనందయ్య మందు కావాలనుకునే వారు కృష్ణపట్నం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు గానూ.. www.childeal.in అనే వెబ్సైట్ను రూపొందించారు. త్వరలోనే ఈ వెబ్సైట్ అందుబాటులోకి రానుంది. ఎవరికైనా ఆనందయ్య మందు కావాలనుకుంటే ఈ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న వారికి నేరుగా ఇంటికే మందును కొరియర్ ద్వారా పంపిస్తారు.
ఆనందయ్య మందు కావాల్సిన వారు ఎవరూ ఇతర ప్రాంతాల నుంచి కృష్ణపట్నం రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. మందు కోసం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలని చెబుతున్నారు. మరోవైపు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఆనందయ్య మందును పంపిణీ చేయాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
చాలా మందికి మందు అవసరం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో మందును తయారీ చేస్తున్నారు. ఇందుకు కృష్ణపట్నం పోర్టు ప్రాంగణాన్ని ఉపయోగించుకుంటున్నారు. జూన్ 7వ తేదీ నుంచి ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం అవుతోంది. కాగా, ఆనందయ్య మందు కరోనాకు బాగా పని చేస్తుందనే ప్రచారంతో ప్రజల్లో బాగా నమ్మకం పెరిగింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా మందు పంపిణీ చేస్తుండటంతో ఆనందయ్యలో నిజాయితీ ఉందని ప్రజలు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మందు కోసం ఎగబడ్డారు. దీంతో శాస్త్రీయంగా ఈ మందుపై అధ్యయనం చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయూష్ శాఖతో పాటు జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఆనందయ్య మందును పరిశీలించి సానుకూల నివేదిక ఇచ్చాయి. దీంతో ఆనందయ్య మందు పంపిణీకి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఈ మందు వాడితే కరోనా నయం అవుతుందనే ఆధారాలు మాత్రం లేవని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.
ఈ మందు వాడినా కూడా కరోనా పట్ల అజాగ్రత్త వద్దని సూచించింది. ఆక్సీజన్ లెవల్స్ తక్కువగా ఉన్నవారికి ఆనందయ్య వేసే ఐడ్రాప్స్కు మాత్రం ప్రభుత్వం ఆనుమతి ఇవ్వలేదు. దీనిపై మరింత అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. ఇప్పుడు పీ, ఎల్, ఎఫ్ అనే మందులకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇవే పంపిణీ చేయనున్నారు.